పవన్ కల్యాణ్ ఒక్కడు చాలు తన పరువు, తన పార్టీ పరువు పూర్తిగా బజారున పడేసుకోడానికి. బద్వేల్ లో ఏకగ్రీవానికి కృషిచేయండి, మేం పోటీనుంచి తప్పుకుంటున్నాం అని చెప్పి వారం రోజులు కాలేదు, అప్పుడే బీజేపీకి మద్దతిస్తామంటూ నాలిక మడతబెట్టేశారు.
ఆయన నేరుగా చెప్పకపోయినా ఆయనలో అర్థభాగం నాదెండ్ల చెప్పారు కాబట్టి, పవన్ అనుమతితోనే చెప్పారనుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కూడా ప్రచారానికి వస్తాడేమో. అదే జరిగితే బద్వేల్ రోడ్లపై పవన్ కల్యాణ్, తన పరువు తానే పారేసుకున్నట్టవుతుంది.
ఇప్పుడే కాదు, గతంలో కూడా పవన్ ఇలాంటి తలతిక్క, తెలివి తక్కువ పనులు చాలానే చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకంగా బీ-ఫామ్ లు ఇచ్చేసి మరీ వెనక్కు తగ్గారు.
తిరుపతిలోనూ అంతే.. టికెట్ కోసం బీజేపీపై ఒత్తిడి తెచ్చి నిమిషంలో వెనక్కి తగ్గి అందర్నీ గందరగోళంలోకి నెట్టేశారు. తాజాగా బద్వేల్ లో మరోసారి అదే జరిగింది.
పోటీలో లేరు అంటే లేనట్టే ఉండాలి. అంతేకానీ, బీజేపీకి సపోర్ట్ చేస్తాం, టీడీపీ మద్దతు కూడగడతాం, మేం మాత్రం పోటీ చేయం అంటే జనాలు నవ్వుకుంటున్నారు. తిరుపతిలో చేసింది అదే కదా, అంతమాత్రాన బద్వేల్ లో జనసేన పోటీ చేయదు, సంప్రదాయాన్ని గౌరవిస్తుంది అని కబుర్లు చెప్పడం ఎందుకు.. సినిమాల్లో వేసినట్టు ఇన్ని వేషాలెందుకు..?
పవన్ మాట కూడా అదేనా..?
బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసైనికులు బీజేపీకి మద్దతిస్తారంటూ హడావిడిగా నాదెండ్ల మనోహర్ ప్రకటించారు కానీ పవన్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అధికారికంగా ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా ఎలాంటి ప్రెస్ నోట్ విడుదల కాలేదు.
పవన్ హైదరాబాద్ మీటింగ్ లో ఉండగా, ఇక్కడ ఒంగోలులో నాదెండ్ల కంగారులో టంగ్ స్లిప్ అయ్యారా? లేక బీజేపీ ఒత్తిడి ఏమైనా ఉందా..? అనేది తేలాల్సి ఉంది. నాదెండ్లకు సొంతంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే ధైర్యం లేదు కానీ, జనసేన సోషల్ మీడియా విభాగాల్లో అధికారిక ప్రకటన విడుదల కాకపోవడంతో ఇంకా జనసైనికుల్లో అయోమయం కంటిన్యూ అవుతోంది.
మొత్తమ్మీద ఎవరో వచ్చి పవన్ పరువు తీయక్కర్లేదు, తన తలతిక్క నిర్ణయాలతో తన పరువు తానే తీసుకుంటారని ఆయన మరోసారి రుజువు చేసుకున్నారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలతో ఈమధ్యే సగం పరువుపోయింది, ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికల డ్రామాతో మరోసారి జనం దృష్టిలో పలుచన అవుతున్నారు జనసేనాని.