మధ్యయుగం నాటి సామ్రాజ్యవాద పోకడలే తన బలోపేతానికి మార్గాలని పీపుల్స్ రిప్లబిక్ చైనా పాలకులు భావిస్తున్నట్టుగా ఉన్నారు. ఇందులో భాగంగా తైవాన్ దురాక్రమణకు చైనా తెరలేపుతున్న దాఖలాలు వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు ఉండీ, లేనట్టుగా ఉన్న తైవాన్ ను చైనా కబళించేస్తుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.
తయారీ రంగంలో ప్రపంచంలోనే పేరెన్నిక గల దేశాల్లో ఒకటి తైవాన్. మేడిన్ తైవాన్ ప్రోడక్ట్స్ ను మనం కూడా ఎన్నో వాడుతూ ఉంటాం. ప్రపంచంలో అత్యధిక జీడీపీని కలిగి ఉన్న దేశాల జాబితాలో తైవాన్ ది 19వ స్థానం! అభివృద్ధిలోనూ, జీవన ప్రమాణాల్లో కూడా చాలా గొప్ప స్థితిలో ఉంది. అయితే తైవాన్ కు లేనిదల్లా స్వతంత్రమే. ప్రస్తుతం తైవాన్ లో ఒక ప్రభుత్వం ఉంది, దానికో రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలకు స్వేచ్ఛాస్వతంత్రాలు ఉన్నాయి.
ఇన్ని ఉన్నా.. తైవాన్ కు ఐక్యరాజ్యసమితితో సహా చాలా చోట్ల దేశంగా గుర్తింపు లేదు! వరల్డ్ బ్యాంక్ వద్ద కూడా తైవాన్ అనే పేరుకు చోటు లేదు! అలాగని ఇది చైనాలో ప్రస్తుతానికి అంతర్భాగం కాదు, చైనాతో అనునిత్యం యుద్ధం చేసుకుంటున్నదీ లేదు. చైనా, తైవాన్ ల మధ్య సరిహద్దు తగాదాలు లేవు. బోలెడంత మంది తైవానీలు చైనాలో నివసిస్తున్నారు. వీరి సంఖ్య పది లక్షల వరకూ ఉంటుంది.
వీరిలో చాలా మంది చైనాలో పరిశ్రమలను ఏర్పాటు చేసిన వారున్నారు. అలా స్నేహపూర్వక వ్యాపార సంబంధాలే ఉన్నాయి. కానీ.. తైవాన్ తమ దేశంలో అంతర్భాగం అనేది చైనీ పాలకుల వాదన. కానీ.. చరిత్రలో తైవాన్ ఒక స్వతంత్ర ప్రాంతం కావడం గమనార్హం.
మధ్యయుగ కాలం వరకూ ఆటవిక తెగలతో తైవాన్ ఎలాంటి రాజ్యాలు, రచ్చలేకుండా ఉంది. అప్పటి వరకూ చరిత్రలో ఈ దీవి ప్రస్తావన పెద్దగా లేదు. అయితే చైనాను చింగ్ రాజులు ఏలిన సమయంలో తైవాన్ వారి ఆధీనంలోకి వచ్చింది. గిరిజనులకు చైనీయులు అలా పాలకులు అయ్యారు. ఆ తర్వాత చైనీ-జపనీ యుద్ధంలో జపాన్ విజయంతో చింగ్ లు తైవాన్ ను జపాన్ కు ధారదత్తం చేశారు. దాదాపు వంద సంవత్సరాలకు పైగా తైవాన్ జపాన్ ఆధీనంలో నిలిచింది. ఆ సమయంలో జపనీయులు తైవాన్ లో పెద్ద ఎత్తున స్థిరపడినట్టుగా చరిత్ర చెబుతోంది.
ఇక రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో.. చైనాకు తైవాన్ ను అప్పగించింది. రెండో ప్రపంచ యుద్ద విజేతలు అయిన యూకే-యూఎస్ ఆమోదంతో తైవాన్ ను చైనా సొంతం చేసుకుంది. అయితే చైనాలో వచ్చిన తిరుగుబాటు తో తైవాన్ గతి మళ్లీ మారింది. కమ్యూనిస్టుల తిరుగుబాటుతో ఓడిపోయిన నేషనలిస్టులు.. తైవాన్ వెళ్లి దాక్కొన్నారు.
అంతే కాదు.. తాము తైవాన్ నుంచి చైనాను పాలించబోతున్నట్టుగా ప్రగల్బాలు పలికారు. అప్పటికే దేశంలో చక్కబెట్టుకోవాల్సిన వ్యవహారాలు చాలా ఉండటంతో తైవాన్ పై దండెత్తే పని పెట్టుకోలేదు మావో. కొన్నేళ్లకు తైవాన్ కూడా అభ్యున్నతి రీతిన పయనించింది. చైనా నుంచి పారిపోయి వచ్చిన పాలకులే చాలా కాలం అధికారం చలాయించారు. ఆ తర్వాత దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. తైవాన్ అనేక రకాలుగా అభ్యున్నతిని సాధించింది.
ప్రజలు స్వేచ్ఛస్వతంత్రాలతో బతగలుగుతున్నారు. అయితే అంతర్జాతీయ వేదికలపై తైవాన్ కు గుర్తింపు ఉండదు. ఒలింపిక్స్ లో కూడా చైనీస్ తైపీ పేరుతో కొంతమంది ఆటగాళ్లు పాల్గొంటారు. ఆ చైనీస్ తైపీ అంటే మరేమిటో కాదు.. తైవానే! ఇటీవల టోక్యో ఒలింపిక్స్ లో కూడా చైనీస్ తైపీ ఆటగాళ్లు మెరుగ్గా పతకాలను సాధించారు.
ఒలింపిక్స్ అధికారిక ఓపెనింగ్ సెర్మనీలో చైనీస్ తైపీని ఉద్దేశించి, తైవాన్ అంటూ సంబోధించింది జపానీ యాంకర్. అలా చైనాను జపాన్ గుచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఒలింపిక్స్ పూర్తయిన తర్వాత తాము సాధించిన పతాకల సంఖ్యలో చైనీస్ తైపీ ఆటగాళ్ల పతకాలను కూడా కలిపి చెప్పుకుంది చైనా!
తద్వారా తామే అత్యధిక పతకాలను సాధించినట్టుగా ప్రకటించుకుని తృప్తి పడింది. ఇలా తైవాన్ పై తనకున్న మోజును అడుడగునా చాటుకుంటోంది. తైవాన్ ను ఇప్పుడు చైనా ఆక్రమిస్తే.. చైనా ఆర్థిక శక్తి కూడా చాలా పెరుగుతుంది. అయితే చైనా లో తమ దేశం భాగమైతే.. తమకున్న స్వేచ్ఛస్వతంత్రాలు అన్నీ హరించుకుపోతాయని, తాము చైనీ పాలకుల కంబంధ హస్తాల్లో నలిగిపోతామని తైవాన్ యువత ఆందోళన చెందుతూ ఉంది.
తైవాన్ కు ప్రత్యేక దేశం గుర్తింపునే అక్కడ మెజారిటీ జనాలు కోరుకుంటున్నారు. రెండు మూడు శాతం మంది చైనాతో కలిసిపోయినా ఫర్వాలేదని అంటున్నారట. మిగతా వాళ్లు యథాతథ స్థితి కోరుకుంటున్నారు. ఏతావాతా ప్రస్తుత పరిస్థితుల్లో తైవాన్ ను చైనా ఆక్రమించడం అంటే.. దురాక్రమణే.
చైనా తీరానికి తైవాన్ ద్వీపం కేవలం 180 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే అంతర్జాతీయ సమాజానికి ఎంతో కొంత భయపడి చైనా దురాక్రమణకు సిద్దం కాలేకపోతున్నట్టుగా ఉంది. మరోవైపు తైవాన్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇటీవలే అఫ్గానిస్తాన్ ను ఖాళీ చేసి వెళ్లిన అమెరికా, తైవాన్ తరఫున ఏమేరకు పోరాడుతుంది? అనేది ప్రశ్నార్థకమే. తైవానీ పాలకులు మాత్రం.. తమపై చైనా ఏ క్షణమైనా దాడికి పాల్పడవచ్చనే అభిప్రాయాలను తమ దేశ పార్లమెంట్ లలోనే వ్యక్తం చేస్తూ ఉన్నారు.