జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఎర్రన్న హాట్ కామెంట్స్ చేశారు. అసలు పవన్ పార్టీ విధానమేంటి, ఆయన చెబుతున్నదేంటి అంటూ సీపీఐ రామక్రిష్ణ గట్టిగానే తగులుకున్నారు. పోరాడే పార్టీ అంటూ చెప్పుకునే పవన్ బీజేపీకి ఊడిగం చేయడమేంటి అంటూ కస్సుమన్నారు.
రైతులను చంపే పార్టీ, కార్మికుల పొట్ట కొట్టే పార్టీగా బీజేపీని అభివర్ణించిన రామక్రిష్ణ ఆ పార్టీకి పవన్ మద్దతు ఇవ్వడమేంటి అని ఆగ్రహించారు. తనది ప్రశ్నించే పార్టీ అంటున్న పవన్ బీజేపీని ఎందుకు ప్రశ్నించరని కూడా నిలదీశారు.
పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు ఇవ్వాలన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదు అనుకున్నా నేరుగా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని అడగాలని సూచించారు.
ఢిల్లీలో బీజేపీ పెద్దలను ప్రశ్నించకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు అంటే అదంతా బ్లఫ్ గానే చూస్తామని రామక్రిష్ణ అనడం విశేషం. పవన్ తన పార్టీ విధానాలకు కట్టుబడితే బీజేపీ తో మిత్ర బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బద్వేల్ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే భార్యకు వైసీపీ వారు టికెట్ ఇచ్చారని, అందువల్ల సానుభూతితో తాము పోటీ చేయమని చెప్పిన పవన్ తెల్లారేసరికల్లా బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారని రామక్రిష్ణ ప్రశ్నించారు.
ఇదేం మాట మార్చడం పవన్ అంటూ ఆయన గర్జించారు. మొత్తానికి సీపీఐ రామక్రిష్ణ పవన్ విషయంలో గతానికి భిన్నంగా దూకుడు పెంచడం విశేషం.