ఎన్నికలంటేనే గొడవలు, రాద్ధాంతాలు. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు సర్వసాధారణం. ఈ ధోరణి సాధారణ ఎన్నికలకే పరిమితం కాదని ‘మా’ ఎన్నికలు నిరూపించాయి. ఇవాళ ఉదయం ప్రత్యర్థుల కౌగిలింతలతో ప్రారంభమైన ‘మా’ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అందరూ ఆశించారు. కానీ పోలింగ్ బూత్ మహత్యమో, మరే కారణమో అక్కడ సినీ సెలబ్రిటీలు కొట్టుకునే వరకూ వెళ్లింది. తెరపై హీరోలుగా, రకరకాల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా నటించిన వాళ్లు ఎన్నికల విషయానికి వచ్చే సరికి విలన్లగా మారిపోయారు.
పోలింగ్ బూత్‌లో ఇరు ప్యానెళ్ల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. విష్ణు ప్యానెల్‌గా మద్దతుదారుడైన వీకే నరేష్, ప్రకాశ్‌రాజ్ పరస్పరం కొట్టుకునే వరకూ వెళ్లడం గమనార్హం. గుర్తు తెలియని వ్యక్తి ఓటు వేయడానికి రావడంపై వీకే నరేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో నరేష్-ప్రకాశ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అరే.. ఒరే.. కొడకా అని తిట్ల పురాణం అందుకున్నారు.
‘వాడిని పట్టుకోండి.. పట్టుకోండి’ అని నరేశ్ అన్నారు. ఇది విన్న ప్రకాశ్‌రాజ్ తీవ్రంగా స్పందించారు. ‘ఏయ్.. వాడిని కాదు, నన్ను కొట్టి చూడు.. నన్ను కొట్టు.. రారా.. గెలవరా నా మీద.. రేయ్.. నా కొడకా..!’ అంటూ మీదకి వెళ్లారు. నరేశ్ మాత్రం సంయమనంతో …వాదనొద్దు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. చివరికి ప్రకాశ్‌రాజ్‌ను శ్రీకాంత్, ఉత్తేజ్ కంట్రోల్ చేయాల్సి వచ్చింది.
అలాగే మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న నటుడు శివ బాలాజీ చేతిని నటి హేమ కొరకడం పెద్ద దుమారం రేపుతోంది. హేమ తన చేయి కొరికిందంటూ మీడియాకు చూపించడం గమనార్హం. ఆయన ఏం చేయకుండానే కొరికేస్తామా?. శివ బాలాజీ చేతులు వేయడం వల్లే తను కొరికనట్టు ఆమె మీడియాకు వివరణ ఇచ్చారు. ఎన్నికలయ్యాక అసలు ఏం జరిగిందో మీడియాకు చెబుతానని హేమ చెప్పడం కొసమెరుపు.
అలాగే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేస్తున్ననటుడు బెనర్జీపై మంచు మోహన్‌బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని వార్తలొస్తున్నాయి. ఇలా చిన్నచిన్న సంఘటనలే అయినా….700 ఓట్ల లోపు పోలైన ఎన్నికల్లో, ఇవి చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజకీయాలు, ఎన్నికలంటే…ఆలాగే వుంటుంది మరి అని సినీ, రాజకీయ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.