ఇటీవల కాలంలో న్యాయస్థానాల్లో దాఖలవుతున్న ప్రజావ్యాజ్యాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సధాకర్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో చేసిన వాదన ఆలోచింప జేసేలా ఉంది.
“ప్రజా ప్రయోజనాల పేరుతో ప్రచార వ్యాజ్యాలను దాఖలు చేసే పిటిషనర్లు హైకోర్టును స్వర్గధామంలా భావిస్తున్నారు. ఇలాంటి వ్యాజ్యాల ద్వారా వారంతా ప్రభుత్వాన్ని నడపాలని, శాసించాలని ఉబలాటపడుతున్నారు” అని హైకోర్టుకు నివేదించారు. ప్రజావ్యాజ్యం అనేది రాజ్యాంగం సామాన్యులకు కల్పించిన ఓ గొప్ప వరం. కానీ కొందరికి అది ప్రచార వ్యాజ్యమనడంలో సందేహం లేదు. కానీ శనివారం సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజావ్యాజ్యం మాత్రం…అసలు సిసలు ప్రజావ్యాజ్యం అంటే ఇది కదా అనే భావన కలిగించేలా ఉంది.
దేశంలో పేరెన్నికగన్న ముగ్గురు వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ ముగ్గురు ప్రముఖులు దేశంలోనే గొప్ప జర్నలిస్టుగా పేరొందిన ఎన్.రామ్, ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరీ కలిసి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే…ముగ్గురూ కూడా కోర్టు ధిక్కార కేసు నమోదైన వారే.
కోర్టు ధిక్కార చట్టం వాక్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘిస్తోందంటూ సుప్రీంకోర్టులో ఆ ముగ్గురు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలను నిరుత్సాహ పరుస్తోందని పిటిషనర్ల ప్రధాన అభియోగం. ప్రధానంగా 1971నాటి కోర్టు ధిక్కార చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని పిటిషనర్లు ఆరోపించారు. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలను రద్దు చేయాలని కోర్టును కోరారు.
రాజ్యాంగపరంగా చూసినా ఈ చట్టం అస్పష్టంగా, నిరంకుశంగా ఉందంటూ పిటిషన్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం చీఫ్ జస్టిస్‌ను కించపరిచేలా ట్వీట్లు చేశారని, అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందంటూ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే మోడీ ఆరేళ్ల పాలనలో పనిచేసిన నలుగురు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లపై , న్యాయ వ్యవస్థపై ప్రశాంత్ భూషణ్ ఘాటైన ట్వీట్లు చేయడం తీవ్ర దుమారం రేపింది.
అలాగే సుప్రసిద్ధ జర్నలిస్ట్ ఎన్.రామ్ కూడా కోర్టు ధిక్కరణ విచారణ ఎదుర్కొంటన్నారు. కొల్లం లిక్కర్ ట్రాజెడీ కేసులో కేరళ హైకోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రచురించినందుకు ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ విషయానికి వస్తే ఆయనపై కూడా ఇలాంటి కేసే నమోదైంది.
జస్టిస్ కుల్దీప్ సింగ్ కమిషన్ గురించి రాసిన వ్యాసానికి అరుణ్ శౌరీ కోర్టు ధిక్కార కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ వ్యాసం కోర్టు ధిక్కారం కాదని కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ముగ్గురూ కోర్టు ధిక్కార కేసు నమోదైన వాళ్లు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ పిల్‌పై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో అనే ఉత్కంఠ మాత్రం అందరిలో ఉంది.