జగన్ అనుకున్నది సాధించారు. శాపగ్రస్థ విశాఖకు రాజధాని పేరిట రాజయోగం కల్పించారు. జగన్ లాంటి బలమైన నాయకుడు తలచుకోబట్టే విశాఖకు కాపిటల్ స్టాటస్ దక్కిందన్నది వాస్తవం. విశాఖకు రాజధాని హోదా ఎపుడో రావాల్సింది. అదిపుడు సాకారం అయింది. నిజానికి చరిత్ర పుటల్లోకి వెళ్తే విశాఖ ఏనాడో రాజధానిగా రాణించిందని చెబుతారు.
క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దంలో బౌధ్ధ సామ్రాజ్యానికి రాజధానిగా విశాఖ ఉందని చరిత్ర పుటల్లో ఉంది. మళ్ళీ ఇన్ని శతాబ్దాలకు విశాఖ జాతకాన్ని మార్చింది జగనే అని చెప్పకతప్పదు. విశాఖను ఇన్నాళ్ళు వాడుకున్న వారే ఉన్నారు కానీ అభివ్రుధ్ధి చేద్దామనుకున్న వారు లేరు. ఇక విశాఖ ప్రగతికి ఆకాశమే హద్దుగా ఉంటుందనడంలో సందేహం. లేదు.
ఈ క్రమంలో ఆగస్ట్ 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు విశాఖ రాజసంగా రెట్టింపు ఆనందంతో పండుగ చేసుకోనుంది. ఆ రోజునే ముఖ్యమంత్రి జగన్ విశాఖలో మువ్వన్నెల జెండా ఎగురవేస్తారని సమాచారం. అదే రోజు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కి ప్రారంభోత్సవం ఉంటుందని కూడా తెలుస్తోంది. మొత్తానికి స్మార్ట్ సిటీకి సచివాలయం రావడానికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి.
2018 ఆగస్ట్ నాటికి విశాఖ జిల్లా నర్శీపట్నంలో జగన్ పాదయాత్రలో ఉన్నారు. నాడు విపక్ష నేత హోదాలో విశాఖ జిల్లాలో జెండా ఎగరవేశారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేళ విశాఖలోనే కార్యక్రమం నిర్వహించాలనుకున్నా చివరి నిముషంలో రద్దు అయింది. ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో రాజధాని నగరంలో జగన్ జెండా వందనం కార్యక్రమం నిర్వహించడం అంటే నిజంగా ఓ అద్భుతమే. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే.