“మేమంతా ఒక కుటుంబం.. మాలో మాకు ఎలాంటివి ఉండవు.. ఎన్నికల తర్వాత అంతా కలిసిపోతాం.” చిరంజీవి నుంచి కరాటే కల్యాణి వరకు చాలామంది చెప్పారు ఈ కబుర్లు. కానీ ఇవన్నీ పైకి చెప్పుకునేవి మాత్రమే. పరిశ్రమలో కక్షలు అలానే ఉన్నాయి. అవి ఈరోజు బయటపడ్డాయి.
నిన్నటివరకు ఒకర్నొకరు తిట్టుకున్న సినీనటులు.. ఈరోజు ఏకంగా రోడ్డెక్కారు. మీడియా కెమెరాల ముందే కొట్టుకున్నారు. నటి హేమ అయితే మరో అడుగు ముందుకేసి, నటుడు శివబాలాజీ చేయి కొరికేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఈ ''చెత్త ఘట్టానికి'' వేదికగా మారింది.
ఇంతకీ ఏం జరిగింది..?
పోలింగ్ స్టేషన్ లోపల ప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఆరోపించారు. ఆడిటోరియం లోపల శివబాలాజీ, సమీర్ కరపత్రాలు పంచుతున్నారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. సరిగ్గా అదే టైమ్ లో నటుడు బెనర్జీ ఓటు వేయడానికి వచ్చారు. బెనర్జీని చూసిన వెంటనే మోహన్ బాబులో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.
ఏమైందో ఏమో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక దశలో బెనర్జీని చంపేస్తానంటూ బెదిరించారు మోహన్ బాబు. బెనర్జీని బండ బూతులు తిట్టారు. ఇక్కడితో వ్యవహారం ఆగిపోలేదు. ప్రకాష్ రాజ్ కు చెందిన గన్ మెన్లు లోపలకు వచ్చారని, వాళ్లను బయటకు పంపించాలని కూడా ఫిర్యాదుచేసింది మంచు విష్ణు ప్యానెల్.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఏం చేసింది..?
ఈసారి “మా” ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. కొంతమంది వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డులతో హాల్ లోకి ప్రవేశించి రిగ్గింగ్ చేశారని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఆరోపించారు. దీంతో అధికారులు సీసీటీవీ ఫూటేజ్ ను పరిశీలించారు. సాయంత్రానికి దానిపై ఓ ప్రకటన చేస్తారు.
మరోవైపు పోలింగ్ స్టేషన్ బయట మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ కు చెందిన వ్యక్తులు ముగ్గురు కొట్టుకున్నారు. నరేష్ సమక్షంలోనే ఈ బాహాబాహీ జరిగింది. మనమంతా ఓ ఫ్యామిలీ సఖ్యతగా ఉండాలంటూ ఓవైపు నుంచి మంచు విష్ణు ఎప్పట్లానే కామన్ డైలాగ్స్ కొడుతుంటే.. “సఖ్యత లేదు బొక్కా లేదు కొట్టు నా కొడుకుని” అనే డైలాగ్స్ మరోవైపు నుంచి వినిపించాయి.
శివబాలాజీని కొరికిన హేమ
సభ్యుల మధ్య బాహాబాహీ ఏ స్థాయికి చేరిందంటే.. లోపల నటీనటులు అక్షరాలా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఒక దశలో నటి హేమ.. నేరుగా దూసుకెళ్లి శివబాలాజీ చేయి కొరికేసింది. బయటకొచ్చిన శివబాలాజీ మీడియాకు హేమ కొరికిన తన చేయిని చూపిస్తూ.. ముఖం చూపించలేక మళ్లీ లోపలకు పరుగులు పెట్టాడు.
ఓవైపు ఇంత జరుగుతుంటే.. మరోవైపు ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కలిసి మీడియా ముందుకొచ్చారు. ప్రకాష్ రాజ్ భుజంపై చేయివేసి మరీ మంచు విష్ణు మాట్లాడారు. లోపల అంతా బాగానే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. సుమన్, ముకేష్ రిషి లాంటి నటులు మాత్రం ఓటు వేసిన తర్వాత బయటకొచ్చి, లోపల చాలా హాట్ హాట్ గా ఉంది, రసాభసగా ఉందని కామెంట్స్ చేయడం విశేషం.