ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకోవడంతో పాటు, తిరుపతి-తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేపు మధ్యాహ్నం తిరుపతి చేరుకునే వైఎస్ జగన్ .. అక్కడ బర్డ్ హాస్పిటల్ లో చిన్నారుల గుండె జబ్బు చికిత్స కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత అలిపిరి నడక మార్గంలో ఒక దాత నిర్మించిన పై కప్పును, మరో దాత నిర్మించిన గో మందిరాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సాయంత్రం తిరుమల్లో ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు.
శ్రీవారికి ఏపీ తరఫున పట్టు వస్త్రాలను సమర్పించి, స్వామి వారిని దర్శించుకోనున్నారు. సోమవారం రాత్రి తిరుమల పద్మావతి అతిథి గృహంలోనే వైఎస్ జగన్ మోహణ్ రెడ్డి బస చేయనున్నారు. మంగళవారం తెల్లవారుజామున మరోసారి శ్రీవారిని దర్శించుకుని ఎస్బీబీసీ హిందీ-కన్నడ చానళ్లను జగన్ ప్రారంభించనున్నారు.
అలాగే బూందీపోటు భవనం ప్రారంభం, రైతు సాధికార సంస్థ-టీటీడీల మధ్య ఒప్పంద కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. ఇలా రెండు రోజుల పాటు తిరుపతి- తిరుమలలో జగన్ మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనంతో సహా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.