యూపీలో ఆందోళన తెలుపుతున్న రైతులపైకి వాహనాలను ఎక్కించిన వ్యవహారంపై.. రైతులకు మద్దతుగా స్పందించిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై ఆ పార్టీ చాలా వేగంగానే చర్యలు తీసుకుంది. వరుణ్ ను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించేసింది బీజేపీ హై కమాండ్.
దేశంలోని 80 మంది బీజేపీ కీలక నేతలు ఉండే ఈ కార్యవర్గం నుంచి వరుణ్ ను, ఆయనతో పాటు ఆయన తల్లి మేనకను బీజేపీ హైకమాండ్ తప్పించింది. ఈ విషయంలో వరుణ్ గాంధీ కూడా స్పందించారు. తను నాలుగైదేళ్లుగా ఆ కార్యవర్గ సమావేశాలకు అటెండ్ అయ్యింది కూడా లేదని, అలాంటప్పుడు తనను తప్పించినా తనకు బాధేం లేదని కౌంటర్ ఇచ్చాడు!
పార్టీ టోన్ కు భిన్నంగా స్పందించి, హత్యలకు జవాబు చెప్పాల్సి ఉంటుందన్న వరుణ్ ట్వీట్ కు ఈ రకంగా ట్రీట్ మెంట్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. అయితే దాన్ని తను ఖాతరు చేయనంటూ వరుణ్ కూడా కుండబద్దలు కొట్టేశాడు!
వాస్తవానికి వరుణ్ గాంధీకి బీజేపీలో అసహనంతో ఉండబట్టి చాలా కాలమే అయినట్టుగా ఉంది. మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం పట్ల అభ్యంతరాలను వ్యక్తం చేసిన బీజేపీ వాళ్లలో వరుణ్ కూడా ఒకరు. 2014 ఎన్నికలకు ముందు మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతున్న వేళ.. రాజ్ నాథ్ సింగ్ ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఒకటి ఉండేది. దానికి మద్దతుదారుల్లో ఒకరు వరుణ్. యూపీలో జరిగిన కొన్ని సమావేశాల్లో రాజ్ నాథ్ ను కాబోయే ప్రధానమంత్రి అన్నట్టుగా వరుణ్ సంబోధించారు.
ఇక మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి కావడం, ప్రధాని కావడం జరిగిన తర్వాత.. వరుణ్ కు అసలేమాత్రం ప్రాధాన్యత దక్కలేదు. మేనకు కాస్త ప్రాధాన్యతను ఇచ్చినట్టే ఇచ్చి, తగ్గించేశారు. ఇక గత యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరుణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఆశించాడు.
తన బలప్రదర్శన కార్యక్రమం కూడా ఒకటి చేపట్టాడు. అక్కడ నుంచి వరుణ్ కు ప్రాధాన్యత మరింత తగ్గిపోయింది. ఈ పరిణామాల్లో పార్టీకి నచ్చని రీతిలో స్పందించడానికి వరుణ్ వెనుకాడుతున్నట్టుగా లేడని స్పష్టం అవుతోంది. దీనికి… పార్టీ కూడా ఘాటుగా స్పందించింది. మరి ఇక వరుణ్ ఏం చేస్తాడు? అనేది ఆసక్తిదాయకమైన విషయం.