రిపబ్లిక్ సినిమా ఓ మంచి ప్రయత్నం. అందులో సందేహం లేదు. ఓ ఇరవై, పాతిక కోట్ల హీరో డేట్లు దొరికాక, సరైన నిర్మాత చేతిలోకి వచ్చాక, మూడు ఫైట్లు, ఆరు పాటల సినిమా కాకుండా, మాంచి రొమాంటిక్ సీన్ల గురించి ఆలోచించకుండా, సమాజానికి ఏదో చెప్పాలని, ఏదో చేయాలని ఆలోచించడం అంటే మంచి ప్రయత్నమే.
రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమా తీయకుండా రిపబ్లిక్ లాంటి సినిమా ట్రయ్ చేయడం మంచిదే. కానీ ఆ సినిమా ఎక్కడొ మిస్ ఫైర్ అయింది. జనాలు కనెక్ట్ కాలేకపోయారో? పండాల్సిన ఎమోషన్స్ పండలేదో? హడావుడి క్లయిమాక్స్ నచ్చలేదో? సమ్ థింగ్..ఏదో జరిగింది.
సినిమాకు ఓపెనింగ్స్ ఒక మాదిరిగా వచ్చాయి. ఆ తరువాత మౌత్ టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ కాలేదు. కలెక్షన్లు ఇంప్రూవ్ కాలేదు. అన్ని చోట్ల కలిపి థియేటర్ల ద్వారా ఆరు కోట్లకు మించి కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దాదాపు 40 శాతం వెనక్కు ఇవ్వడమో, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడమో జరిగింది.
సాధారణంగా సినిమా సంగతి చూసి, ఓ రేంజ్ దగ్గర ఇక మోయడం ఆపేస్తారు. లేపడం తగ్గిస్తారు. అయితే హీరోలు మాత్రం తమ సినిమా ఓ రేంజ్ కు వెళ్లడం అవసరం కనుక, దాన్ని ఏదో విధంగా లాగడానికి చూస్తారు. ఇదంతా కూడా ఎప్పుడు? సినిమా కాస్త అటు ఇటుగా ఊగుతున్నపుడు. కొద్దిగా పుష్ చేస్తే బాగుండిది అని అనుకున్నపుడు. అలా కాకుండా టోటల్ గా నడక ఆగిపోయాక ఇక చేసేదేమీ లేక పక్కన పెట్టేస్తారు.
కానీ రిపబ్లిక్ సినిమాను ఎలాగో అలా వార్తల్లో వుంచాలని దర్శకుడు దేవా కట్టా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఇది మెగా మూవీ. కానీ మెగా ఫ్యాన్స్ వైపు నుంచి కానీ, మెగా క్యాంప్ వైపు నుంచి కానీ అస్సలు ఓ మాట, పలుకు లేదు. హీరో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు అని మెగా బంధువులు, బాంధవ్యులు ఎవ్వరూ తమ వంతు బాధ్యత తీసుకోలేదు.
అంతమంది హీరోలు, నటులు వున్నారు కానీ ఒక్కరు ఒక్క బైట్ ఇవ్వలేదు. కానీ దేవా కట్టా తరపున మాత్రం ఓ సెక్షన్ మొత్తం రంగంలోకి దిగింది. ఆ సినిమాను ప్రమోట్ చేయడం అనే కన్నా మోయడం ఎక్కువయింది. ఎందుకు ఇలా చేస్తున్నారు? కేవలం సినిమాను ప్రమోట్ చేయడానికా? హీరో కోసమా? అంటే అలా అనిపించడం లేదు. ఎందుకంటే ఈ మోతలో ఎక్కడా హీరో కనిపించడం లేదు. డైరక్టర్ దేవానే కనిపిస్తున్నారు. ఆయన ఐడియాలజీ మాత్రమే వినిపిస్తోంది.
సినిమా ఆరంభంలో వైకాపా మీద ఒకటి రెండు చెణుకులు వినిపిస్తాయి. ఆ తరవాత అలాంటి వ్యవహారాలు వుండవు. మరి ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్తే ఆంధ్ర ప్రజలు చైతన్యవంతం అవుతారని, రూలింగ్ పార్టీ నెగిటివ్ అట్మాసిఫియర్ వస్తుందని ఆ సెక్షన్ నమ్ముతోందా? ఆశిస్తోందా? లోకేష్ సినిమా చూడకుండానే ట్వీట్ వేసారు. జయప్రకాష్ నారాయణ్ లాంటి పొలిటీషియన్ ను కూడా ఈ వ్యవహారంలోకి దింపారు. తెలుగుదేశం అంటే ఇష్టమో, మద్దతో వున్నవారు కూడా రంగంలోకి దిగారు. అంటే ఏంటి జరుగుతోంది? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
లేదూ ఇవన్నీ మాకు అనవసరం. 'మా దేవా' మాకు అవసరం. మా దేవాకు మరో మంచి సినిమా పడాలి. అలా పడాలి అంటే రిపబ్లిక్ అనే ఓ గొప్ప సినిమా అనే కలర్ రావాలి అని అనుకుంటూ ఈ పల్లకీ మోత ప్రారంభించారా? మొత్తానికి ఏదో జరుగుతోంది ఈ వ్యవహారం వెనుక.