చిరంజీవి: ఎప్పూడూ ఒకేలా పరిస్థితులు ఉండవు. పరిస్థితులకు తగ్గట్టు మనం కూడా మారాలి. ఇలాంటివి జరగకూడదని లేదు, ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. అదే జరుగుతోంది. వ్యక్తిగతంగా నేను మాట్లాడి ఓటర్లను ప్రభావితం చేయను. ఎక్కువ మంది ఓటర్లు ఎవ్వర్ని ఎన్నుకుంటే వాళ్లకే నా మద్దతు ఉంటుంది.అసోసియేషన్ ఎన్నికల్లో ఇదో ప్రత్యేకమైన సందర్భం. ప్రతిసారి ఇలా జరగదు. భవిష్యత్తులో ఇంత పోటీ లేకుండా ఉండేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాను.
పవన్ కల్యాణ్: వ్యక్తులు చేసేది ఎప్పుడూ సినిమా రంగానికి అంటదు. వ్యక్తులు చేసే ఆరోపణలు కేవలం వ్యక్తిగతం, సినిమా రంగానికి అది అంటదు. ఇంత చిన్న అసోసియేషన్ లో అంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది. అలా జరగలేదు. ఇండస్ట్రీ ఐక్యతను విచ్ఛిన్నం చేసేలా ఎవ్వరూ వ్యవహరించకూడదు. ఈ ఎన్నికల్లో డబ్బు పంచారని అంటున్నారు. ఆ విషయం నాకు తెలియదు, నాకు ఇంకా పెద్ద పనులు చాలా ఉన్నాయి.
బాలకృష్ణ: ఎప్పట్లానే మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఎవరు బాగా చేస్తారని నా మనసుకు అనిపించిందో వాళ్లకు నేను ఓటు వేశాను. ఈ ఉత్సాహం చూస్తుంటే.. రెండు ప్యానెల్స్ బాగానే పనిచేస్తాయనిపిస్తోంది. కానీ ఒకరికే వేయాలి, వేశాను. వేరే ప్యానెల్ లో కూడా కొందరు బాగా పనిచేస్తారనే నమ్మకంతో వాళ్లకు కూడా వేశాను. ప్రకాష్ రాజ్, విష్ణు ఇద్దరూ నాకు కావాల్సిన వాళ్లే. షూటింగ్స్ లో కలుసుకోవాల్సిందే కదా.
సాయికుమార్: ప్రజాస్వామ్యంలో పోటీ తప్పదు. అసోసియేషన్ చిన్నదే అయినప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సిందే. నేను కూడా పోటీలో నిలబడదాం అనుకున్నాను. కానీ వ్యక్తిగత కారణాల వల్ల కుదరలేదు. లాస్ట్ టైమ్ కూడా కమిటీలో ఉన్నాను కానీ ఒక్క ఈసీ మీటింగ్ కు కూడా హాజరుకాలేకపోయాను. న్యాయం చేయలేకపోతున్నానని పోటీ నుంచి తప్పుకున్నాను. ఈసారి ఎన్నికల్లో వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం బాధాకరం.
ప్రకాష్ రాజ్: ఎన్నికల తర్వాత కూడా ఇండస్ట్రీ అంతా కలిసే ఉంటుందా అనేది నేను అప్పుడే చెప్పలేను. ఫలితాలు వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడతాను. ప్రస్తుతానికైతే అందరూ వచ్చి ఓటేయాలని కోరుకుంటున్నాను.
మంచు విష్ణు: చాలామంది కాల్స్ చేస్తున్నారు. కొంతమంది దారిలో ఉన్నారు. అందరూ వస్తున్నారు. ఓట్లు వేస్తున్నారు. షూటింగ్స్ కు కూడా మినహాయింపు ఇచ్చారు కాబట్టి అందరూ వచ్చి ఓటు వేయాలి. ఈసారి చాలామంది దృష్టి ఎన్నికలపై పడింది కాబట్టి, పోలింగ్ శాతం పెరగొచ్చని అనుకుంటున్నాను.
నరేష్: పోలింగ్ బాగుంది. 9 గంటలకే 30శాతం పోలింగ్ పూర్తయింది. చాలామంది వస్తున్నారు. ఈసారి 500 మందికి పైగా ఓట్లు వేస్తారని అనుకుంటున్నాను. కిందటిసారి 457 మంది మాత్రమే ఓటేశారు.
నటి రాశి: ప్యానెల్స్ ఏం చెప్పాయి, మేనిఫెస్టోలు ఏంటనేది నేను స్పందించను. ఓటు వేయడం నా హక్కు. అందుకే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాను.