ప్రజాప్రతినిధి తన కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తే ప్రజలు సంతోషిస్తారు. ప్రజలు ప్రశంసించేలా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వ్యవహరించారు. మాండోస్ తుపాను ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా వుంది. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ తుపాను కారణంగా ఏపీలోని తిరుపతి జిల్లాలో తీవ్ర వర్షం పడడంతో పాటు పెనుగాలులు వీస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఈ విషయం తెలిసి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. తిరుపతి కమిషనర్ కుమారి అనుపమ అంజలి, ఎస్ఈ మోహన్‌లను అప్రమత్తం చేశారు. అధికారులను వెంటబెట్టుకుని ఆయన లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, ఆటో నగర్, ఎమ్మార్‌పల్లిలోని కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో నడుం పైగా వరద నీటిలో దిగారు. వర్షంలోనే తడుస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తుపానుతో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపారు.
డ్రైనేజీల ద్వారా వరద నీళ్లు వెళ్లేందుకు అడ్డంకులు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న 50 కుటుంబాలను కెనడీ నగర్‌లోని తమిళ పాఠశాలకు తరలింపజేశారు. అక్కడ వారికి వసతి, భోజన సౌకర్యం కల్పించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను, కరెంట్ స్తంభాలను తొలగించి రవాణా, విద్యుత్ సౌకర్యాలను పునరుద్ధరించారు. దీంతో తిరుపతి వాసులకు ఇక్కట్లు తప్పాయి. ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో నగర వాసులకు అండగా నిలిచి తిరుపతి ఎమ్మెల్యే ప్రజల మన్ననలు పొందారు.