చంద్రబాబు గెలిస్తే అన్నదానం ఒక్కటే పథకం!

చంద్రబాబునాయుడు తన పర్యటనల్లో భాగంగా ప్రసంగంలో ఓ అద్భుతమైన మాట సెలవిచ్చారు. అన్న క్యాంటీన్ కంటె పెద్ద సంక్షేమం ఏముంటుందని ఆయన వాక్రుచ్చారు. అన్న క్యాంటీన్ అనేది మంచి పథకమే. కానీ దానిని మించిన…

చంద్రబాబునాయుడు తన పర్యటనల్లో భాగంగా ప్రసంగంలో ఓ అద్భుతమైన మాట సెలవిచ్చారు. అన్న క్యాంటీన్ కంటె పెద్ద సంక్షేమం ఏముంటుందని ఆయన వాక్రుచ్చారు. అన్న క్యాంటీన్ అనేది మంచి పథకమే. కానీ దానిని మించిన సంక్షేమమే లేదని అనడం చంద్రబాబునాయుడు అపరిపక్వతకు నిదర్శనంగా పలువురు విమర్శిస్తున్నారు. జనానికి అన్నం పెట్టడం కాదు బాబూ.. వాళ్లు సంపాదించుకుని తినే పరిస్థితిని కల్పించాలి.. అదీ సంక్షేమం అంటే.. అంటూ చంద్రబాబుకు నీతులు చెబుతున్నారు.

ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది. ఎవరికైనా సాయం చేయదలచుకుంటే ‘చేపను అందివ్వడం కాదు.. చేపలు పట్టడం నేర్పు’ అనేది సామెత. అంటే వ్యక్తులు తమ జీవితంలో తాము నిలదొక్కుకునేలా, తమ కాళ్లమీద తాము బతకగలిగేలా స్వావలంబన వాతావరణం సృష్టించడమే సంక్షేమం అనిపించుకుంటుంది. అంతే తప్ప అన్య క్యాంటీన్ పేరుతో అయిదు రూపాయలకు అన్నం పెట్టేసి.. రాష్ట్రమంతా బాగుచేసేశాం అని డప్పు కొట్టుకుంటే సరిపోదు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెస్తున్న పథకాలన్నీ.. పేదలు జీవితంలో నిలదొక్కుకునే దిశగానే ఉంటున్నాయి. చిన్న చిన్న వృత్తి పనుల్లో ఉన్న వారికి, టైలర్లకు, ఆటో డ్రైవర్లకు ఇలా ఒకరేమిటి రకరకాల వారికి ఏటా అందించే ఆర్థికసాయం వారికి అంతో ఇంతో చిరు పెట్టుబడులకు ఉపకరిస్తూ.. అప్పులకోసం దేవులాడకుండా జీవితంలో నిలదొక్కుకోడానికి వారికి తోడ్పడుతుంది. చిరు వ్యాపారాలు చేసేవారికి పది లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చే ఏర్పాటును జగన్ సర్కారు చేపడుతోంది. జగన్ ప్రతి ఆలోచన కూడా జీవితాలను నిలదొక్కుకునేలా చేయడం దిశగానే సాగుతోంది. 

అసలే చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే గనుక.. ఈ సంక్షేమ పథకాలన్నింటికీ చెక్ పెట్టినట్టే అనే ప్రచారం విస్తృతంగా ఉంది. ఆయన కొన్నిసార్లు ఆ మాటలను ఖండిస్తుంటారు. కానీ.. ఇవాళ ‘అన్న క్యాంటీన్ ను మించిన సంక్షేమం ఇంకొకటి ఉండదు’ అనడాన్ని గమనిస్తే ప్రజలకు భయం పుడుతోంది. అన్న క్యాంటీన్ లను ఆయన చెబుతున్నట్టుగా మండలానికి ఒకటి తెరిచి, పేదవాళ్లంతా అక్కడకు వెళ్లి అయిదురూపాయలకు తినండి.. మిగిలిన పథకాలన్నీ ఎత్తేస్తా అని అంటారేమో అని జనం అనుకుంటున్నారు. 

ఇంకా కావలిస్తే.. గతిలేని వాళ్లకి రాష్ట్రమంతా అన్నదాన పథకం ఏర్పాటు చేస్తా.. ఇక వేరే సంక్షేమం గానీ.. స్వావలంబన గురించి గానీ.. జీవితాలు బాగుపడడం గురించి గానీ, అభివృద్ధి గురించి గానీ ఇంకేమీ అడగొద్దు అంటూ చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే రెచ్చిపోతారేమో  అని జనం భయపడుతున్నారు. అయినా.. అన్న క్యాంటీన్ ల మీద ప్రేమ ఉంటే వాటిని తాను తిరిగి ప్రారంభిస్తాననడం మంచిదే. అంతేగానీ, అదొక్కటే అసలైన సంక్షేమం.. జగన్ చేస్తున్నవి కాదు.. దానిని మించిన సంక్షేమం లేదు అని అంటే ప్రజలు ఈసడించుకుంటారు.