తిరుప‌తిని వ‌ణికిస్తున్న మాండోస్‌

మాండోస్ తుపాను ఆధ్యాత్మిక క్షేత్రం తిరుప‌తిని వ‌ణికిస్తోంది. ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని సంద‌ర్శించేందుకు దేశ‌, విదేశాల్లోని న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చే సంగ‌తి తెలిసిందే. మాండోస్ తుపాను…

మాండోస్ తుపాను ఆధ్యాత్మిక క్షేత్రం తిరుప‌తిని వ‌ణికిస్తోంది. ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని సంద‌ర్శించేందుకు దేశ‌, విదేశాల్లోని న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చే సంగ‌తి తెలిసిందే. మాండోస్ తుపాను ప్ర‌భావంతో రెండు రోజులుగా తిరుప‌తి జిల్లాలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తోంది.

ప్ర‌ధానంగా తిరుప‌తి న‌గ‌రంలో వ‌ర‌ద నీరు రోడ్ల‌పైకి వ‌చ్చింది. న‌గ‌రంలోని ల‌క్ష్మీపురం స‌ర్కిల్‌, ఎయిర్ బైపాస్ రోడ్ల‌లో మ్యాన్‌హోల్స్ పొంగి వ‌రద‌నీరు రోడ్డుపైకి రావ‌డంతో స్థానికులు, వాహ‌నదారుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. అలాగే కెన‌డీన‌గ‌ర్‌లో క‌రెంట్ స్తంభాలు , భారీ వృక్షాలు విరిగిప‌డ్డాయి. దీంతో క‌రెంట్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. 

తిరుప‌తి జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి. ఇదిలా వుండ‌గా తిరుప‌తిలో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తెల్ల‌వారుజాము నుంచే ప‌ర్య‌టిస్తున్నారు. తుపాను ఇబ్బందుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారుల‌తో చ‌ర్చిస్తూ అప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్కార చర్య‌లు తీసుకుంటున్నారు. 

తుపాను ప్ర‌భావం తీవ్రంగా వుంటుంద‌ని ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ పౌరుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ముఖ్యంగా ఈదురు గాలులు తీవ్రంగా వుండ‌డంతో ఇళ్ల‌లో నుంచి బ‌య‌టికి రావాలంటే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులు త‌మ ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి.