వైఎస్ షర్మిల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందా? తెలంగాణ రాష్ట్రంలో ఆమె రాజకీయ ప్రస్థానాన్ని అరాచకంగా అణచివేయాలని చూస్తున్నదా? కనీసం అనుమతులు ఇవ్వకుండా తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నదా? తెలంగాణ రాజకీయాల్లో తన సొంత ముద్ర చూపించడానికి ప్రయత్నిస్తున్న ఆడబిడ్డ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నదా? అనే అభిప్రాయాలు సర్వత్రా ప్రజల్లో కలుగుతున్నాయి. ఆమె పాదయాత్రకు అనుమతులు నిరాకరించడంతో పాటు, ఆమె నిరాహార దీక్ష చేయాలనుకుంటే అత్యంత కర్కశంగా ఆమెను అక్కడినుంచి తరలించడం, ఈ సందర్భంగా పోలీసులు ఆమె పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కలిసి షర్మిల మీద ప్రజల్లో సానుభూతిని పెంచుతున్నాయి.
వైఎస్ షర్మిల అసలు సిసలు పోరాటయోధురాలిలాగా వ్యవహరిస్తున్నారు. తాను చేయదలచుకున్న పని నుంచి ఆమె ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ.. ఆమె మరింత బలం పుంజుకుని పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఏపీ రాజకీయాలకు పూర్తిగా దూరమైన షర్మిల.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి పోరాడుతున్నారు. పాదయాత్ర చేస్తూ కేసీఆర్, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. చాన్నాళ్లపాటు అధికార గులాబీ నేతలు షర్మిల యాత్రను, విమర్శలను పట్టించుకోకుండా వదిలేశారు. అయితే నెమ్మదిగా షర్మిలకు పెరుగుతున్న ఆదరణ వారిని భయపెట్టిందా అనిపిస్తోంది. వరంగల్ జిల్లాలో పాదయాత్ర సాగుతుండగా.. గులాబీ శ్రేణులు ఆమె యాత్ర మీద దాడికి పాల్పడడం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం జరిగింది. అప్పుడు షర్మిలను అరెస్టు చేసిన దగ్గరినుంచి వరుస సంఘటనలు షర్మిల పట్ల ప్రభుత్వ అరాచక ధోరణిని స్పష్టం చేస్తున్నాయి.
ప్రగతి భవన్ ముట్టడించడానికి కారులో వెళ్తున్న షర్మిలను, ఆమె కారులో కూర్చుని ఉండగానే క్రేన్ సహాయంతో తరలించి అరెస్టు చేయడం చాలా తీవ్రమైన సంఘటనగా అందరూ పరిగణిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ విషయమై ఆమెకు ఫోను చేసి పరామర్శించినట్లుగా వార్తలు వచ్చాయి. పోలీసుల వైఖరికి ఆమెకు సానుభూతి తెచ్చి పెట్టింది.
ఆ తర్వాత కూడా పాదయాత్ర కొనసాగించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఆమె వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారంటూ నో చెప్పారు. అయితే తెలంగాణలో వ్యక్తిగత విమర్శలు చేయకుండా ప్రజల ఎదుట మాట్లాడుతున్న రాజకీయ నాయకుడు ఒక్కరైనా ఉన్నారా? అటు అధికార పార్టీనుంచి ఇటు కాంగ్రెస్, బీజేపీ వరకు అందరూ వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లే. ఎవ్వరికీ వర్తించని నిబంధనలు షర్మిలకు మాత్రమే వర్తిస్తాయి అన్నట్టుగా పోలీసుల వైఖరి కనిపిస్తోంది. మోడీ నుంచి ఫోను పలకరింపు వచ్చిన తర్వాత.. షర్మిల పట్ల తెలంగాణ సర్కారు మరింత సీరియస్ గా వేధింపులకు పాల్పడుతున్నదా అనే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది.
తన పాదయాత్రకు అనుమతి కోసం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాదయాత్రకు షర్మిల ప్రయత్నిస్తే అత్యంత బలవంతంగా ఆమెను అరెస్టు చేసి ఇంటికి తరలించి ఇంట్లో వదిలిపెట్టారు. ఇప్పుడు షర్మిల ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. తన పాదయాత్రకు అనుమతులు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. బహుశా రెండు రోజుల తర్వాత.. ఇంట్లోకి చొరబడి పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించవచ్చు.కానీ.. ఆమె పట్ల ప్రభుత్వం ఎందుకింత అమానుషంగా వ్యవహరిస్తోంది అనేదే అర్థం కాని సంగతి.
ప్రజాస్వామ్యంలో దీక్షలు, నిరసనలు, పాదయాత్రలు ఏమీ ఉండకూడదని కోరుకుంటున్నారా? ఆ మాటకొస్తే బండిసంజయ్, ప్రవీణ్ కుమార్, అర్వింద్ వంటి వారు తిట్టే తిట్ల కంటె షర్మిల వేసే నిందలు ఎంతో మర్యాదగానే ఉంటున్నాయి కదా.. మరి ఆమె పట్ల మాత్రమే ఈ వైఖరి ఎందుకు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ అణచివేత విధానాలతో షర్మిలకు పాదయాత్రకు మించిన క్రేజ్ ప్రజల్లో లభిస్తున్నదని అంతా అనుకుంటున్నారు.