ప్రత్యర్థి కొంత బలహీనంగా కనిపిస్తే మరింత బలంగా దెబ్బకొట్టి ఒకేసారికి అంతం చేసేయాలని అనిపిస్తుంది. అదే- ప్రత్యర్థి మరింత బలంగా కనిపిస్తే.. కాస్త అదను కోసం వేచిచూడాల్సి ఉంటుంది. యుద్ధంలోనైనా, వేటలోనైనా అనుసరించాల్సిన సాధారణ సిద్ధాంతం ఇది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా జాతీయ రాజకీయాల్లో ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇటీవలి కాలంలో అసలు మైకు ముందు మాట్లాడే ఏ అవకాశం వచ్చినా సరే.. సందర్భ శుద్ధి లేకుండా మోడీ మీద విరుచుకుపడిపోవడం అలవాటుగా మార్చుకున్న కేసీఆర్.. తమ జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిని ప్రారంభించే సందర్భంలో మాత్రం మోడీ మీద మాటల దూకుడు తగ్గించారు.కేవలం కేంద్రంలో భారాస అధికారంలోకి వస్తే ఏమేం చేస్తుంది అని చెప్పడం మీదనే దృష్టి పెట్టారు.
గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేసీఆర్ వ్యూహంలో కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. దేశం మోడీని సానుకూలంగా చూస్తోంది. ఈ సమయంలో తాను నిందలు వేసినా సరే ఎవ్వరూ పట్టించుకోరు అనేదే కేసీఆర్ అంచనాగా తెలుస్తోంది. కేంద్రంలో రైతు ప్రభుత్వం తీసుకు వస్తాం అని, ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ప్రస్తుతానికి వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారాస పోటీచేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. అదే ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతు కూడా ఇస్తామన్నారు. జేడీఎస్ సారథి కుమారస్వామి తొలినుంచి కేసీఆర్ తో సన్నిహితంగా మెలగుతూనే ఉన్నారు. కర్ణాటకలో భారాస ప్రవేశం సునాయాసంగానే కనిపిస్తోంది.
ప్రత్యేకించి ఈ సమావేశంలో మోడీ మీద విమర్శల డోసేజీ తక్కువగానే కనిపించింది. గుజరాత్ ఎన్నికల విజయంతో మోడీ ఆదరణ బీభత్సంగా ఉన్నట్టుగా స్పష్టమవుతున్న వేళ.. కేసీఆర్ కొంత తగ్గినట్టుగా కనిపిస్తోంది. లేదా, ఈ కార్యక్రమంలో మోడీ ప్రస్తావన పరిమితం చేసి, 14వ తేదీన ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా మోడీపై విరుచుకుపడతారా? అనే అంచనాలు కూడా రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. లేదా, ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో తన కూతురు కవిత విచారణ ఎదుర్కోబోతున్న నేపథ్యంలో కేసీఆర్ మోడీ పట్ల కాస్త మెతక ధోరణికి దిగివచ్చారా? అనే అభిప్రాయం కూడా పలువురిలో కలుగుతోంది.