బాబుగారు పంచితే శ్రీలంక కాదా?

మొత్తానికి సంక్షేమాన్ని ఇన్నాళ్లూ ఈసడిస్తున్న పార్టీలు మళ్లీ అదే పాట అందుకుంటున్నాయి. జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు తప్పు, రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెబుతూ వచ్చిన వారు. పేజీలకు పేజీలు కథలు వండి…

మొత్తానికి సంక్షేమాన్ని ఇన్నాళ్లూ ఈసడిస్తున్న పార్టీలు మళ్లీ అదే పాట అందుకుంటున్నాయి. జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు తప్పు, రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెబుతూ వచ్చిన వారు. పేజీలకు పేజీలు కథలు వండి వార్చిన వారు..ఆ హామీలు ఆపము అని చెబుతున్నారు. పైగా మండలానికీ ఓ అన్న క్యాంటీన్ తెరుస్తామని లేటెస్ట్ గా హామీ ఇస్తున్నారు.

దాదాపు ఆరు వందల మండలాలు… రెండు పూటలా భోజనం..ఉదయం టిఫిన్లు..మూడు సార్లు పెట్టాలి. మండల కేంద్రాల్లోనే పెడతారు అనుకున్నా..కనీసం రోజుకు మూడు సార్లు కూడా వెయ్యేసి మంది కేంటీన్లకు వస్తారు. అంటే మూడువేల మంది. మనిషికి వంద రూపాయల సబ్సిటీ చూసుకున్నా మండలానికి రోజుకు మూడు లక్షలు. అంటే రోజుకు రాష్ట్రం అంతా కలిపి 18 కోట్లు కావాలి. ఏడాదికి దాదాపు ఏడు వేల కోట్లు అవసరం. మరి ఇది డబ్బులు ఫ్రీగా పంచేయడం కాదా? అప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోదా? జగన్ పంచితే శ్రీలంక అవుతుంది. చంద్రబాబు పంచితే కాదా?

ఇలా అడిగితే జగన్ పంచుతున్నాడుగా అంటారు. కానీ ఇక్కడే చిన్న తేడా వుంది. జగన్ నేరుగా జనం ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారు. కానీ చంద్రబాబు అన్న క్యాంటీన్ల సబ్సిడీ జనానికి నేరుగా అందదు. అది ఎలా అన్నది చూద్దాం.

అన్న క్యాంటీన్ ను ప్రభుత్వం నిర్వహించదు. ప్రయివేటు వ్యక్తులకు లేదా ట్రస్ట్ ల వెనుక దాగిన ప్రయివేటు వ్యక్తులకు, పార్టీ జనాలకు ఇస్తుంది. వాళ్లు అయిదు రూపాయలకు టిఫిన్, భోజనం పెట్టాలి. కానీ ప్రభుత్వం వారికి ముందగా ఒప్పందం కుదుర్చుకున్న రేటు ఇస్తుంది. అంటే టిఫిన్ కు ఏ ఇరవై నో ముఫై నో, భోజనానికి డెభై నో వందనో ఇలా అన్నమాట. ఇక ఇక్కడే గోల్ మాల్ స్టార్ట్ అవుతుంది. రోజుకు ఎంత మంది తింటారు అన్న లెక్కల గోల్ మాల్. అంటే జనాలకు క్యాంటీన్ ల పేరు చెప్పి, ప్రయివేటు వ్యక్తులు బాగుపడతారు.

ప్రజలకు అయిదు రూపాయలకు భోజనం ఇస్తూనే, మధ్య దళారీలు అయిన అస్మదీయులను పోషించుకోవడం అన్నమాట. గత నాలుగేళ్లలో నేరుగా జనాలకు డబ్బులు వెళ్తున్నాయి కానీ వాటిల్లో రూపాయి కూడా దళారీలకు అస్మదీయులకు లబ్ది లేదు. కానీ బాబు గారి స్కీము అలా కాదు. జనాలకు ఇస్తున్నట్లు వుండాలి. అందులో ‘మనవాళ్లు’ కూడా బాగుపడిపోవాలి. ఇదే అసలు పథకం.

బాబుగారు ఇలా ఖర్చు చేసినా మన సామాజిక మీడియాకు ఆనందమే. ఎందుకంటే ఏడువేల కోట్లలో లాభం అంతా వెళ్లేది పథకం వెనుక ట్రస్ట్ లు, సేవా సంస్థల పేరుతో చేరే మనవాళ్లకే కదా.