సెట్ లో హీరోల సెన్సాఫ్ హ్యూమర్ ఒక్కోసారి కదం తొక్కుతూ వుంటుంది. షూటింగ్ గ్యాప్ లో సెట్ లో మహేష్ బాబు భలే పంచ్ లు వేస్తుంటారు. అక్కడ వున్న ఎవరో ఒకరు బకరా అయిపోతుంటారు. ఇలా పంచ్ లు వేసే అలవాటు మరి కొంత మంది హీరోలకు కూడా వుంది.
నిన్నటికి నిన్న ఓ షూటింగ్ టైమ్ లో నందమూరి బాలకృష్ణ ఇలాగే పంచ్ లు పేల్చారు. దాదాపు పావుగంట పాటు ఆడేసుకున్నారు. నవ్వులు పండించారు. నిన్నటికి నిన్న బాలయ్య సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి సినిమా పెద్దలు చాలా మంది వెళ్లారు. వారిలో దిల్ రాజు కూడా వున్నారు.
ఆ మాటా ఈ మాటా అయ్యాక ‘నిన్ను దిల్ రాజు అని ఎందుకు అంటారు..నువ్వు రాజు కాదు కదా’ అని బాలయ్య ప్రశ్నించారు. దానికి దిల్ రాజు బదులిస్తూ తనను అంతా రాజు అని పిలుస్తారని, దిల్ సినిమా తో దిల్ రాజుగా మారానని చెప్పారు.
కానీ బాలయ్య అక్కడితో ఆగలేదు..కౌంటర్ మీద కౌంటర్ అన్నట్లుగా, ‘నీకు దిల్ కూడా లేదుగా’ అన్నారు చటుక్కున. దాంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. సినిమాల పంపిణీ, థియేటర్లు ఇతరత్రా వ్యవహారాల్లో దిల్ రాజు చాలా కట్టుగా, గట్టిగా వ్యవహరిస్తారని టాక్ వుంది. ‘నీకు దిల్ కూడా లేదుగా’ అనగానే అక్కడున్న జనాలందరికీ అదే గుర్తుకు వచ్చి నవ్వులు విరిసాయి. ఆ తరువాత కూడా మరి కాస్సేపు బాలయ్య తన చతుర్లతో దిల్ రాజును ఆడుకున్నారు.