వైసీపీ అనూహ్య దాడిః టీడీపీ ఉక్కిరికిబిక్కిరి!

వైసీపీ అనూహ్య దాడితో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జూమ్ మీటింగ్‌ల పేరుతో ఇష్టానుసారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై నోరు పారేసుకోవ‌డాన్ని వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. లోకేశ్ జూమ్ కాన్ఫ‌రెన్స్‌లోకి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీల…

వైసీపీ అనూహ్య దాడితో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జూమ్ మీటింగ్‌ల పేరుతో ఇష్టానుసారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై నోరు పారేసుకోవ‌డాన్ని వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. లోకేశ్ జూమ్ కాన్ఫ‌రెన్స్‌లోకి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీల ప్ర‌వేశం కేవ‌లం ఒక్క‌రోజుతో ఆగిపోయేది కాద‌ని, ఇది కేవ‌లం ఆరంభం మాత్ర‌మే అని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చ‌రించారు. అంటే రానున్న రోజుల్లో వైసీపీకి చెందిన ముఖ్య నేత‌లు టీడీపీ ఆన్‌లైన్ మీటింగ్‌ల‌కు వెళ‌తార‌ని విజ‌య‌సాయిరెడ్డి నేరుగానే చెప్ప‌డం టీడీపీని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

లోకేశ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏవో ఆటలు ఆడుకుంటూ వుంటారు. స‌ర‌దాగా జూమ్ మీటింగ్‌లు పెట్టుకుని, ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ కాలం వెళ్ల‌దీస్తుంటారు. ఇప్పుడు ఆ ఆనందం కూడా మిగిల్చేది లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. అస‌లే నిన్న‌టి జూమ్ మీటింగ్‌లో కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌వేశం , లోకేశ్ త‌ప్పుకోవ‌డాన్ని టీడీపీ ప‌రాభ‌వంగా భావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌ప్పుడు ఐడీల‌తో కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ జూమ్ మీటింగ్‌లోకి చొర‌బ‌డ్డార‌ని, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ సీఐడీకి టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామయ్య శుక్ర‌వారం ఫిర్యాదు చేశారు. ఒక‌వైపు టీడీపీ ఫిర్యాదుల బాట ప‌ట్ట‌గా, మ‌రోవైపు వైసీపీ మ‌రోసారి ఇలాంటి ఆక‌తాయి ప‌నులు చేస్తే ఊరుకోమ‌ని వైసీపీ ముఖ్య నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి హెచ్చ‌రించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

లోకేశ్ జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో త‌మ వాళ్లు ప్ర‌వేశించ‌డం ఆరంభం మాత్ర‌మే అని విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ముఖ్యంగా విద్య‌కు సంబంధించి దుష్ప్ర‌చారాన్ని అధికార పార్టీ సీరియ‌స్‌గా తీసుకుంది. విద్యార్థుల‌ను పాస్ లేదా ఫెయిల్ చేయ‌డం ప్ర‌భుత్వం చేత‌ల్లో లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. క‌రోనా, ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో విద్యార్థులు ఫెయిల్ అయ్యార‌న్నారు. 

తాను కూడా ఇంట‌ర్ ఫెయిల్ అయిన‌ట్టు విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. వాస్త‌వాల‌ను విస్మ‌రించి, త‌ప్పుడు మాట‌లు చెప్ప‌డం స‌రైంది కాద‌న్నారు. నేరుగా చ‌ర్చ‌కు రావాల‌ని, విధానాల ప‌రంగా విమ‌ర్శ‌లు చేస్తే ఓకే అని, అందుకు విరుద్ధ పంథాలో టీడీపీ ప‌య‌నిస్తే, తాము కూడా అదే రూట్‌లో వ‌చ్చి త‌గిన బుద్ధి చెబుతామ‌ని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చ‌రించ‌డం విశేషం.

లోకేశ్ జూమ్ మీటింగ్‌ల పేరుతో త‌ప్పుడు ప్ర‌చారానికి దిగుతున్నార‌ని, దాన్ని అదే రీతిలో తిప్పికొట్టాల‌ని అధికార పార్టీ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు విజ‌య‌సాయిరెడ్డి హెచ్చ‌రిక‌లు ప్ర‌తిబింబిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌పై జూమ్ మీటింగ్‌లు గ‌తంలో మాదిరిగా సాఫీగా సాగ‌వ‌ని టీడీపీ అర్థం చేసుకోవాల్సి వుంటుంది. జూమ్ మీటింగ్‌ల పేరుతో లోకేశ్‌, చంద్ర‌బాబు ఏక‌పాత్రాభిన‌యం చేస్తుంటే, మిగిలిన వాళ్లంతా శ్రోత‌లు కావాల్సిన ప‌రిస్థితి. 

ఇక వాటిని అడ్డుకునేందుకు వైసీపీ ప‌క్కా వ్యూహంతో ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు నిన్న‌టి లోకేశ్ జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. మ‌రి దీన్ని టీడీపీ దీటుగా ఎదుర్కొనేందుకు ఎలా వ్యూహం ర‌చిస్తుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.