తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సవాల్‌గా మారారు. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదానికి ఎక్కడో ఒక చోట ఫుల్స్టాప్ పడుతుందని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా రోజురోజుకూ వివాదం మరింత జఠిలమవుతున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్‌పై గవర్నర్ కయ్యానికి కాలు దువ్వుతుండడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
ఇవాళ గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. తెలంగాణ మహిళలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోనని ఘాటు హెచ్చరిక చేశారు. ఇది పరోక్షంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యే అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ మహిళల కోసం తన పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. వారిని ఆదుకోడానికి బలమైన శక్తిగా ముందుంటానని స్పష్టం చేశారు.
గవర్నర్ ప్రజలను కలుస్తారా? అని చాలా మందికి అనుమానాలున్నాయన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ప్రజల కోసమే అని గుర్తించుకోవాలని… ప్రజాదర్బార్‌పై విమర్శలు చేసేవారికి ఆమె సమాధానం ఇచ్చారు. తన తెలంగాణ మహిళలకు అండగా ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు. మహిళలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానన్నారు. అంతే తప్ప, ప్రజాదర్బార్ నిర్వహణపై విమర్శలు చేసేవాళ్ల గురించి అసలు పట్టించుకోనన్నారు.
సోదరిలా తెలంగాణ మహిళలకు అండగా నిలవాలని అనుకుంటున్న తనను ఏ శక్తి అడ్డుకోలేదని హెచ్చరించడం గమనార్హం. బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తానన్నారు. స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మద్దతు మహిళలకు చాలా అవసరమన్నారు. మనం గెలుస్తాం, మన గెలుపును ఎవరూ ఆపలేరని గవర్నర్ ధీమాగా చెప్పారు.
ఇదిలా వుండగా మహిళా దర్బార్ నిర్వహణ వెనుక ఎలాంటి రాజకీయం లేదన్నారు. రాజభవన్‌కు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉందన్నారు. రాజ్‌భవన్ అనేది పొలిటికల్ కార్యాలయం కాదన్నారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్‌నకు సంబంధించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా, ఇంత వరకూ ఇవ్వలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.