Advertisement

Advertisement


Home > Movies - Reviews

Ante Sundariniki Review: మూవీ రివ్యూ: అంటే సుందరానికి

Ante Sundariniki Review: మూవీ రివ్యూ: అంటే సుందరానికి

టైటిల్: అంటే సుందరానికి
రేటింగ్: 2.5/5
తారాగణం: నాని, నజ్రియా, నరేష్, రోహిణి, అళగం పెరుమాళ్, నదియా, హర్ష వర్ధన్, అనుపమ పరమేశ్వరన్, పృథ్విరాజ్, అరుణ బిక్షు, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు
కెమెరా: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాతలు: నవీన్, రవిశంకర్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
విడుదల తేదీ: 10 జూన్ 2022

చాలా కాలం తర్వాత నాని తన కామెడీ టైమింగ్ తో "అంటే సుందరానికి" అంటూ పలకరించాడు. ట్రైలర్ ద్వారా కథాగమ్యం అర్థమైపోయినా కథనగమనం ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి కలిగింది. 

బ్రాహ్మణ కథానాయకుడు, క్రైస్తవ కథానాయిక అనగానే వెంటనే గుర్తొచ్చే సినిమా 1980ల నాటి "సీతాకోకచిలుక". ముందు ముందు "అంటే సుందరానికి" గురించి కూడా చెప్పుకుంటారేమోనన్న నమ్మకం కూడా కలిగింది ట్రైలర్ చూస్తే. 

సినిమా చూసాక అనిపించే విషయమేంటంటే దర్శకుడు వివేక్ ఆత్రేయ మరీ ఎక్కువగా వివేకాన్ని వాడేసి స్క్రీన్ ప్లే రాసుకున్నాడని.

ప్రేక్షకులకి ఉత్కంఠ, ఆసక్తి కలిగించడానికి ట్విస్టులు, మలుపులు పెట్టుకోవడం సహజం. 

రోడ్డు మీద మరీ మలుపులెక్కువైతే ప్రయాణం ఆలస్యమెలా అవుతుందో కథనంలో మలుపులూ అంతే. తొందరగా కథ కొలిక్కి రాదు. అప్పుడే హాల్లో నిట్టూర్పులు వినిపిస్తాయి. ఇంకెంతసేపురా బాబూ అనుకుంటూ వాచ్ చూసుకునేలా చేస్తాయి. ఏదైనా బాగుంది అనుకున్నప్పుడే ఆగాలి. దాన్నే ఇంకా సాగతీస్తే వెగటొస్తుంది, విసుగొస్తుంది. ఇక్కడదే జరిగింది. 

ఈ సింపుల్ కథలో చాలా లోటుపాట్లున్నాయి. ఎంత కామెడీ కోసం అనుకున్నా 2020 లో సముద్రం దాటితే నాలుక మీద వాత పెట్టించుకునే బ్రాహ్మణులెక్కడున్నారు? 

అదలా ఉంచితే మరో పక్కన జోసెఫ్ పాత్ర. కథకి పెద్దగా ప్రయోజనం లేకపోయినా ఈ పాత్ర చిరాకుపెట్టించేంత మాడర్న్. 

ఆ విధంగా అతి అచారంతో ఒక పాత్రని, అతి మాడర్న్ ఆలోచనతో మరో పాత్రని రాసుకుని అతిగా చూపించాడు దర్శకుడు. 

కామెడీ టైమింగుతో స్మూత్ గా సాగిపోతోందనుకున్న కథనం మధ్యలో హీరోయిన్ అక్క పాత్ర చుట్టూ నడిపిన కథ సీరియల్ ని తలపిస్తుంది. అలాగే చిన్నప్పటి సీన్లు పదే పదే చూపిస్తూ మరీ జీడిపాకం చేసారు. 

వివేక్ ఆత్రేయ ప్రతిభగల దర్శకుడు. కథనాన్ని చాలా హిలారియస్ గా మెదడుకి అస్సలు స్ట్రెయిన్ ఇవ్వకుండా నడపగలడు. కానీ ఇక్కడమాత్రం దారి తప్పాడు. మూడు గంటలైనా శుభం కార్డు పడని వైనం, ఒక టికెట్ మీదే రెండు సినిమాలు చూసినంత నీరసం కలగడం దర్శకుడి లోపమే. 

అన్నట్టు రెండు సినిమాలంటే గుర్తొచ్చింది. ప్రధమార్థంలో కాసేపు నాని కనపడకుండా వంశీ అనే పాత్రతో హీరోయిన్ కి నడిచే ట్రాకొకటుంటుంది. అది చూస్తుంటే సడెన్ గా వేరే సినిమా చూస్తున్న ఫీలింగొస్తుంది.

ఒక వెబ్ సిరీస్ కి పట్టేటంత కథని రాసుకుని మూడు గంటల సినిమాలో ఇరికించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. 

ఇక నెగటివ్స్ పక్కన పెట్టి పాజిటివ్స్ చెప్పుకుందాం. 

నాని తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. తన డయలాగ్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ టాప్ నాచ్ లో ఉన్నాయి. నిజానికి మూడు గంటలపాటు కూర్చోబెట్టింది ఒక్క నానీనే. సైకిల్ మీద కంగారుగా వెళ్తూ అటు హీరోయిన్ తోటి, ఇటు తల్లితోటి ఫోన్ మాట్లాడే సానివేశం గానీ, సెలూన్ ఉదాహరణ చెప్పినప్పుడు గానీ, తండ్రి నరేష్ తో సెకండాఫులో సన్నివేశం గానీ అద్భుతంగా చేసాడు. 

హీరోయిన్ గా నజ్రియా ఓకే. అయితే ఈ పాత్రకి ఆమెనే ఎందుకంటే ఆన్సర్ ఉండదు. ఆమె ప్లేసులో ఎవరైనా ఇంతే చేస్తారు కదా అనిపిస్తుంది. ఎ సెంటర్స్ కి ఓకే అయినా బి, సి సెంటర్ ఆడియన్స్ కి సరిపోని లుక్ ఈమెది. 

ఛాదస్తపు బ్రాహ్మణ తండ్రిగా నరేష్ చక్కగా ఒదిగిపోయాడు. రోహిణి కూడా సగటు గృహిణిగా సరిగ్గా ఉంది. బామ్మగా చేసిన అరుణ బిక్షు కూడా గుర్తుండేలా ఉంది. ఆమె అంగీకారాన్ని వీణావాద్యంతో చెప్పడమనే మ్యానరిజం పాత బాలచందర్, విశ్వనాథ్ సినిమాల నుంచి తీసుకున్నట్టనిపిస్తుంది.

నదియా ఎప్పుడూ కనిపించినట్టే ఉంది. అళగన్ పెరుమాళ్ హీరోయిన్ తండ్రిగా పాత్రకు సరిపోయాడు. 

రాహుల్ రామకృష్ణ తమ శైలిలో టైమింగ్ తో నవ్వించాడు. 

హర్షవర్ధన్ కాసేపు నవ్విస్తున్నాడనుకున్నా అసలా పాత్ర అవసరమేంటో అర్థం కాదు. అదే విధంగా అనుపమా పరమేశ్వరన్ క్యారెక్టర్ కూడా ఇరికించినట్టుంది తప్ప ఫ్రీఫ్లోలో లేదు. ఇలాంటివన్నీ అసలు కథనానికి తోకల్లా తయారయ్యి కంగాళీ స్క్రీన్ ప్లే కి దోహదపడ్డాయంతే.   

వివేక్ సాగర్ పాటలు పరమ వీక్ గా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క పాట కూడా గుర్తుండేలా లేదు. నేపథ్య సంగీతం మాత్రం బాగా చేసాడు. 

పాటల విషయంలో సంగీత దర్శకుడి కన్నా దర్శకుడినే తప్పుబట్టాలి. ఎందుకంటే ఈ తరహా సినిమాల్లో కామెడీతో పాటు పాటలు, లవ్ ట్రాక్ కూడా ఎంతో అవసరం. ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత దర్శకుడిదే. 

దర్శకుడికి తాను తీసిన సీన్స్ మీద మరీ మమకారం ఎక్కువైపోయి ఇంతకంటే ఎడిట్ చేయడం కష్టమనుకుని ఉండొచ్చు కానీ, ఆ పనేదో ఇప్పుడు ప్రేక్షకుకులకి అప్పజెప్పినా కూల్ గా అరగంట లేపేస్తారు. 

చివరిగా చెప్పుకునేదేనటంటే ఈ సినిమాకి ఆద్యంతం కామెడీయే అనుకుని మాత్రం వెళ్లకూడదు. పంటి కింద రాళ్లలాగ వచ్చే హెవీనెస్ ని భరించడానికి కూడా ప్రిపేరైతే తప్ప మూడు గంటల సుదీర్ఘ ప్రయాణం కష్టం. 

బాటం లైన్: అంటే..సాగతీత!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?