చాన్నాళ్ల కిందటి సంగతి.. అప్పట్లో మెగా కాంపౌండ్ కు రామ్ గోపాల్ వర్మకు మధ్య ఓ రేంజ్ లో ఫైర్ నడిచింది. మెగా బ్రదర్ నాగబాబు వర్మపై విరుచుకుపడ్డారు. సరిగ్గా అదే టైమ్ లో “అక్కుపక్షి” అనే పదప్రయోగాన్ని వాడారాయన. ఆ తర్వాత పలు సందర్భాల్లో వర్మపై నాగబాబు విమర్శలు చేసినప్పటికీ.. అక్కుపక్షి అనే పదం మాత్రం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.
రీసెంట్ గా మరోసారి మెగా కాంపౌండ్ ను కెలికాడు ఆర్జీవీ. పవన్ కల్యాణ్ పై పవర్ స్టార్ అనే సినిమా తీసి వదిలాడు. ఇది పవన్ పై తీసిన సినిమా అంటే వర్మ ఒప్పుకోడు. ఆయన లీగల్ సమస్యలు ఆయనకున్నాయి. కానీ ఇది పవన్ ను ఉద్దేశించి తీసిన సినిమా అనే విషయం అందరికీ తెలుసు.
ఈ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమా తర్వాత మరోసారి వర్మపై నాగబాబు రెచ్చిపోతారనుకున్నప్పటికీ, ఆయన మౌనంగా ఉండడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అది వ్యూహాత్మక మౌనం అని కొందరంటారు. అయితే నాగబాబు ఈసారి మరో విధంగా వర్మపై రియాక్ట్ అయ్యారు. తను చేస్తున్న ఓ స్కిట్ లో అక్కుపక్షి ఎపిసోడ్ ను ప్రవేశపెట్టారు.
జీ తెలుగులో “అదిరింది” (జబర్దస్త్ కు కాపీ) అనే కార్యక్రమానికి జడ్జ్ గా చేస్తున్నారు నాగబాబు. ఇందులో ధనరాజ్ టీమ్ అక్కుపక్షి అనే పదాన్ని వాడింది. దానిచుట్టూ ఓ చిన్న కామెడీ పండించే కార్యక్రమం కూడా జరిగినట్టుంది. ఈ మేరకు ఓ ప్రోమో సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న ఆ కార్యక్రమంలో అక్కుపక్షి ఎవరనే విషయంపై క్లారిటీ వస్తుంది.