తమ పార్టీ నేతల అరెస్టులు జరిగితే వాళ్లు బీసీలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాదించారు. ఏకంగా 150 కోట్ల రూపాయల అవినీతి కేసులో అచ్చెన్నాయుడు, ఒక బీసీ వ్యక్తి హత్యలో నిందితుడిగా కొల్లు రవీంద్ర అరెస్టులకు చంద్రబాబు నాయుడు బీసీ కుల రాజకీయం అంటించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే వీళ్ల అరెస్టులు జరిగి వారాలు గడిచాయి.
అరెస్టు అయిన దగ్గర నుంచి బెయిల్ పిటిషన్ల మీద బెయిల్ పిటిషన్లు వేస్తూ వస్తున్నారు ఈ తెలుగుదేశం నేతలు. అయితే ఈ నేతలకు బెయిల్ దక్కడం లేదు. ఇప్పటికే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూ అదే గతి పట్టింది. జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేజింది. తాజాగా కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకే గురి కావడం గమనార్హం.
బీసీ సామాజికవర్గానికే చెందిన మోకా భాస్కరరావు అనే వ్యక్తి హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్టు జరిగింది. ఆ హత్య కేసులో తన పేరు వినిపించగానే పోలీసులకు దొరకకుండా పారిపోయే ప్రయత్నం చేశారట కొల్లు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు వెంబడించి పట్టుకున్నంత పని చేశారు. నిజంగానే ఆ హత్యలో ప్రమేయం లేకపోతే కొల్లు రవీంద్ర ఎందుకు పారిపోయే ప్రయత్నం చేశారనేది శేష ప్రశ్న.
కేసు విచారణలో ఉందని, ఇలాంటి సమయంలో కొల్లు రవీంద్రకు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదన వినిపించినట్టుగా తెలుస్తోంది. ఈ వాదనతో ఏకీభవిస్తూ కొల్లు రవీంద్రకు బెయిల్ నిరాకరించినట్టుగా సమాచారం.