ఒకవైపు అన్న ముకేష్ అంబానీ భారీ సంస్థలను టేకోవర్ చేస్తున్నారు, రాజకీయంగా తిరుగులేని పలుకుబడి సంపాదించారు. అయితే మరోవైపు ఆయన తమ్ముడు అనిల్ అంబానీకి సంబంధించిన ఆస్తులు మాత్రం బ్యాంకుల స్వాధీనం అవుతున్నట్టుగా ఉన్నాయి. బ్యాంకులకు భారీ ఎత్తున అప్పుపడిన నేపథ్యంలో.. రికవరీలో భాగంగా ఆయన ఆఫీస్ స్పేస్ లను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకునే పరిస్థితి వచ్చిందట. తాజాగా ముంబైలో అనిల్ అంబానీ వ్యాపారాలకు సంబంధించిన హెడ్ ఆఫీస్ ను స్వాధీన పరుచుకోవడానికి యస్-బ్యాంక్ నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం.
యస్- బ్యాంకుకు అనిల్ అంబానీ 2,892 కోట్ల రూపాయల అప్పున్నారట. ఆ అప్పుల రికవరీ కోసం ఆ బ్యాంక్ అనేక ప్రయత్నాలు చేసినా, ఫలితం లేకపోవడంతో..ఇప్పుడు ముంబైలోని అనిల్ అంబానీ హెడ్ ఆఫీస్ ను స్వాధీన పరుచుకోవడానికి నోటీసులు ఇచ్చిందట.
ముంబై సౌత్ లో అనిల్ అంబానీ సంస్థలకు సంబంధించిన 21,432 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన నిర్మాణాన్ని బ్యాంకు స్వాధీనం చేసుకోనుందని సమాచారం. ఇప్పటికే తాము జారీ చేసిన 60 రోజుల నోటీసు సమయం ముగిసిందని, ఇక ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోవడమే తరువాయి అని ఆ బ్యాంకు ప్రకటించినట్టుగా సమాచారం.