రీల్ లైఫ్‌లో అతనో విలన్. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఆయనో హీరో. అదికూడా పాపులర్ సింగర్ దృష్టిలో. ఇంతకూ అసలు కథేంటో తెలుసుకుందాం. సినిమాల్లో విలన్ పాత్రల్లో ఆకట్టుకుంటున్న ప్రముఖ నటుడు కబీర్‌సింగ్, పాపులర్ పంజాబీ సింగర్ డాలీ సింధు వివాహ బంధంతో ఒక్కటి కావాలని నిశ్చయించుకున్నారు.
కరోనా మహమ్మారి చాలా యువ జంటలకు విరహ వేదన మిగిల్చింది. ఏళ్ల తరబడి ప్రేమలో మునిగి..పెళ్లితో కొత్త జీవితాన్ని ఆరంభించాలనుకున్న వాళ్లకి లాక్‌డౌన్ సైంధవుడిలా అడ్డుపడింది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో హీరో నితిన్, నిర్మాత దిల్‌రాజు తదితరులు వివాహ బంధంతో కొత్త జీవితంలోకి ప్రవేశించారు.
త్వరలో టాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్ రానా తన ప్రేయసి మిహికాను వివాహమాడనున్న విషయం తెలిసిందే. రానా బాటలో యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా పయనించేందుకు సిద్ధంగా ఉన్నారు. కబీర్ విషయానికి వస్తే… తెలుగులో జిల్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోగా గోపీచంద్ నటించాడు. ఆ తర్వాత సుప్రీమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక కబీర్ -డాలీ సింధు ప్రేమ జంట విషయానికి వస్తే గత ఏడాది వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న తరుణంలో కరోనా అడ్డంకిగా మారింది. దీంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కరోనా నుంచి కోలుకుని పరిస్థితులు చక్కబడితే ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా ప్రభావం పోతేనే పెళ్లి అని కబీర్ కండీషన్ పెడుతున్నట్టు తెలిసింది. కానీ పెళ్లికి సంబంధించిన కార్యాచరణ జరుగుతున్నట్టు సమాచారం. పెళ్లి మాత్రం ముంబై, రిసెప్షన్‌ను ఢిల్లీలో ప్లాన్ చేసినట్టు విలన్ కబీర్ చెబుతున్నాడు. కాగా త్వరలో కబీర్ హీరోగా కూడా ఎంట్రీ ఇస్తాడని చర్చ నడుస్తోంది. అంటే సింగర్ డాలీతో పెళ్లి కబీర్‌కు ప్రమోషన్ కూడా ఇస్తుందన్న మాట.