ష‌ర్మిల అస‌లు త‌గ్గ‌ట్లే!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. కేసీఆర్ స‌ర్కార్ అణ‌చివేత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న కొద్దీ …ఆమె మ‌రింత రెచ్చిపోతున్నారు. త‌న‌పై ప్ర‌భుత్వ క‌క్ష‌పూరిత చ‌ర్య‌ల్ని ష‌ర్మిల రాజ‌కీయంగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ష‌ర్మిల‌కు…

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. కేసీఆర్ స‌ర్కార్ అణ‌చివేత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న కొద్దీ …ఆమె మ‌రింత రెచ్చిపోతున్నారు. త‌న‌పై ప్ర‌భుత్వ క‌క్ష‌పూరిత చ‌ర్య‌ల్ని ష‌ర్మిల రాజ‌కీయంగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ష‌ర్మిల‌కు ఉచిత ప్ర‌చారాన్ని క‌ల్పించ‌డంలో కేసీఆర్ స‌ర్కార్ స‌క్సెస్ అయ్యింది. మిగిలిన ప్ర‌తిప‌క్ష పార్టీల్ని క‌నిపించ‌కుండా వుండే క్ర‌మంలో ….ష‌ర్మిల విష‌యంలో కేసీఆర్ స‌ర్కార్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న అనుమానాలు లేక‌పోలేదు.

హైకోర్టు అనుమ‌తి ఇచ్చినా త‌న పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఇవాళ ష‌ర్మిల ట్యాంక్ బండ్ వ‌ద్ద ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. ఇది ఊహించ‌ని ప‌రిణామ‌మే. తెలంగాణ‌లో ఇప్ప‌టికే 3,500 కి.మీ పాద‌యాత్ర‌ను ష‌ర్మిల పూర్తి చేశారు. జ‌నం స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, వాటిపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు. వ‌రంగ‌ల్ జిల్లాలో ఆమె పాద‌యాత్ర‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.

ష‌ర్మిల పాద‌యాత్ర చేస్తున్న వాహ‌నాల‌ను అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు ధ్వంసం చేశారు. బ్యాన‌ర్ల‌ను త‌గుల‌బెట్టారు. టీఆర్ఎస్ శ్రేణుల చ‌ర్య‌ల్ని నిర‌సిస్తూ ఆమె ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ముట్ట‌డించేందుకు య‌త్నించారు. ఆమెను పోలీసులు అరెస్ట్ చేయ‌డం, బెయిల్ రావ‌డం, గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డం, ప్ర‌ధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశార‌నే ప్ర‌చారం గురించే అంద‌రికీ తెలిసిన‌వే. ఈ నేప‌థ్యంలో హైకోర్టు అనుమ‌తి ఇచ్చినా వ‌రంగ‌ల్ పోలీసులు పాద‌యాత్ర‌కు అడ్డంకులు సృష్టించ‌డాన్ని నిర‌సిస్తూ ఇవాళ ఆమె ట్యాంక్ బండ్‌పై అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

అనంత‌రం అక్క‌డే దీక్ష‌కు దిగారు. ష‌ర్మిల మాట్లాడుతూ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై మాట్లాడే వారి గొంతును ప్ర‌భుత్వం నొక్కుతోంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నార‌ని ఆరోపించారు. కేసీఆర్ నియంత పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని ఆమె విరుచుకుప‌డ్డారు. త‌న పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.  

ఇదిలా వుండ‌గా షర్మిల దీక్షను పోలీసులు వెంట‌నే భగ్నం చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.