టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అవతరించింది. టీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో ఒక తంతు పూర్తయింది. బీఆర్ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన జాతీయ పార్టీని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
జాతీయ పార్టీని ప్రారంభించిన కేసీఆర్‌కు ఆ స్థాయిలో మద్దతు లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రారంభ వేడుకకు జాతీయ స్థాయిలో వచ్చిన నాయకులు దాదాపు ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి కర్నాటక జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, దక్షిణాది ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ మాత్రమే హాజరవడం గమనార్హం.
ఇటీవల కొంత కాలంగా కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతున్న వామపక్ష పార్టీల నాయకులు కూడా రాకపోవడం గమనార్హం. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీని ఢీకొట్టే నాయకుడిని తానే అంటూ బహిరంగ సభల్లో కేసీఆర్ బీరాలు పలకడం చూస్తున్నారు. బీఆర్ఎస్‌ను ప్రారంభిస్తున్న వేళ జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలెవరూ రాని పరిస్థితిలో… బీజేపీకి ప్రత్యామ్నాయ ముచ్చట ఆకట్టుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదో మొక్కుబడి కార్యక్రమంలా సాగిపోయిందని చెబుతున్నారు. పార్టీ పేరులో తెలంగాణను పోగొట్టుకోవడం కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీపై దండయాత్ర చేసే క్రమంలో తన శక్తిసామర్థ్యాలు ఏంటో తెలియకుండా కేసీఆర్ యుద్ధానికి సిద్ధమయ్యారనే వాళ్లే ఎక్కువ. ఏది ఏమైనా కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం అంటే మాత్రం కేసీఆర్ ఒంటరయ్యే ప్రమాదం వుంది.