హుజూరాబాద్ గెలుపు బాధ్యత రేవంత్ భుజాల మీదేనా ?

రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో మొదటి పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఇది అతని సామర్ధ్యానికి లిట్మస్ టెస్ట్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కాకముందు బాగా డల్…

రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో మొదటి పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఇది అతని సామర్ధ్యానికి లిట్మస్ టెస్ట్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కాకముందు బాగా డల్ గా ఉన్న కాంగ్రెస్ అతను పగ్గాలు తీసుకున్న తరువాత బాగా పుంజుకుంది. కేడర్ లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కొత్త ఆశలు చిగురులు తొడుగుతున్నాయి. 

రేవంత్ కారణంగానే కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని విమర్శించడంలో ప్రతిపక్షాల మధ్య పోటీ పెరిగింది. ఇక రేవంత్ రకరకాల నిరసన కార్యక్రమాలతో పార్టీని పరుగులు పెట్టిస్తున్నాడనే చెప్పొచ్చు. సరిగ్గా ఈ సమయంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చి పడింది. 

పార్టీలోని అంతర్గత రాజకీయాల కారణంగా అభ్యర్థిని ప్రకటించడం బాగా ఆలస్యమైంది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు రావడంతో.. హుజూరాబాద్‌లోనూ ఆ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు భావించారు. అందుకు తగ్గట్టుగానే కొండా సురేఖ వంటి బలమైన నేతలను హుజూరాబాద్ రేసులో నిలపాలని చూశారు రేవంత్ రెడ్డి. కానీ కొన్ని ఇతరత్రా కారణాల వల్ల రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ కాలేదు. దీంతో పార్టీలో పెద్దగా ఎవరికీ తెలియని విద్యార్థి విభాగం నాయకుడు బల్మూరి వెంకట్‌ను హుజూరాబాద్ బరిలో నిలిపింది కాంగ్రెస్. 

బల్మూరి వెంకట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు కావడంతో.. ఇక హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించేందుకు పూర్తిగా రేవంత్ రెడ్డి శ్రమించాల్సిందే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. కౌశిక్ రెడ్డి, కొండా సురేఖ వంటి వాళ్లు కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఉంటే.. సొంతంగా వాళ్లు కొంత మేర ఓట్లు సాధించి ఉండేవాళ్ళు అప్పుడు రేవంత్ రెడ్డికి భారం కాస్త తగ్గేది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 

రేవంత్ కు పార్టీ సీనియర్ల నుంచి అంతగా సహకారం ఉండకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొని హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు సాధించడం అంత సులుభం కాదు. 

ఒకవేళ అక్కడ కాంగ్రెస్ గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు దక్కించుకోవాలంటే.. స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి హుజూరాబాద్‌లో విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. అక్కడే మకాం వేసి ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించేందుకు వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. అయితే హుజూరాబాద్‌ ఉప ఎన్నికను రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకుంటారా ? అన్న అంశంపై కూడా కాంగ్రెస్ వర్గాల్లో క్లారిటీ లేదు. 

రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నిక అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని.. ఆయన దృష్టి అంతా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడం ఎలా అనే దానిపైనే  ఉందని అంటున్నారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించేలా చేయడం ద్వారా తన సత్తా చూపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

అయితే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందనే విషయం అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే అక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని రేవంత్ అనుకున్నాడు. అందుకే  మాజీమంత్రి కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది. 

హుజూరాబాద్‌ నుంచి కొండా సురేఖను పోటీ చేయించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ టీమ్ చాలానే శ్రమించిందని.. ఇందుకోసం కొండా దంపతులను ఒప్పించిందనే చర్చ సాగింది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కొండా సురేఖ పోటీ చేయడం దాదాపు ఖాయమనే టాక్ వినిపించింది. 

ఆ సమయంలో కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్యనేతలు స్థానిక నేతలను మాత్రమే రంగంలోకి దింపాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు మాణిక్యం ఠాగూర్‌కు చెప్పారు. దీంతో కథ మారిపోయి ప్రాధాన్యం లేని వెంకట్ తెర మీదికి వచ్చాడు. ఇప్పుడు అతన్ని గెలిపించుకోవడం రేవంత్ రెడ్డికి పరీక్షే.