‘మా’ ఎన్నికల్లో విజయం సాధించి తన బావ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మంచు విష్ణు గిప్ట్‌గా ఇవ్వనున్నారా? అనే చర్చ జరుగుతోంది. ‘మా’ ఎన్నికలను ఇటు మంచు ప్యానల్, అటు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పైకి ఎవరేం చెప్పకపోయినా… ఈ ఎన్నికలు టాలీవుడ్‌లో కులపరమైన చీలిక తెస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ప్రకాశ్‌రాజ్ ఎంతో ముందుగానే తన ప్యానల్‌ను ప్రకటించడం, అలాగే తాను ఏం చేయాలనుకుంటున్నారో ప్రచారంలో పెట్టారు. దీంతో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ పైచేయి సాధిస్తోందన్న అభిప్రాయం అందరిలో కలిగింది. ఆ తర్వాత రోజులు గడిచేకొద్ది సీన్ మారుతూ వచ్చింది. మంచు విష్ణు ప్యానల్ క్రమంగా బలపడుతూ వచ్చింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ల ప్రస్తావన కూడా ఎన్నికల అంశమైంది.
తనకు జగన్ బావ అవుతారని మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో జగన్, కేసీఆర్‌లను ‘మా’ ఎన్ని కల్లోకి ఎందుకు తీసుకొస్తున్నావని ప్రకాశ్‌రాజ్ గట్టిగా నిలదీశారు. రిపబ్లిక్ సినిమా వేడుకలో జగన్ ప్రభుత్వంపై జనసేనాని, అగ్రహీరో పవన్‌కల్యాణ్ తీవ్ర విమర్శలు చేయడం మరింత రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్స్ బలపరుస్తున్న ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓడిపోవాలని వైసీపీ బలంగా కోరుకుంటోంది.
‘మా’ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ‘మా’ ఎన్నికల్లో ఏ వ్యక్తిని లేదా వర్గాన్ని తాము సమర్థించడం లేదని మంత్రి తేల్చి చెప్పారు. అయితే పవన్‌కల్యాణ్ బలపరు స్తున్న ప్రకాశ్‌రాజ్ గెలుస్తారనే భయంతోనే మంత్రి పేర్ని నాని ఇలాంటి ప్రకటన చేశారనే వక్రభాష్యాన్ని ఎల్లో మీడియా ఒక రోజంతా చేసింది.
అయితే ‘మా’ ఎన్నికల్లో మారిన పరిస్థితులను పసిగట్టిన ఎల్లో మీడియా …జగన్ హీరో అవుతారనే భయంతో ఆయన్ను తెరపైకి తేవడం లేదు. దీన్ని బట్టి ‘మా’ ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయో అందరికీ అర్థమవుతూ వచ్చింది. ‘మా’ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి ఏంటంటే…రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు ఒకే వ్యక్తి గెలవాలని కోరుకోవడం. ఏది ఏమైనా జగన్ పేరు ‘మా’ ఎన్నికల తెరపైకి తేవడం వల్ల తమకు నష్టమని భావించడం వల్లే ఎల్లో మీడియా సైలెంట్ అయ్యిందని చెప్పొచ్చు.
కానీ జగన్ తన బావ అని చెప్పడం ఎల్లో బ్యాచ్‌కు ఎక్కడో చివుక్కుమంటోంది. తాను గెలిస్తే మాత్రం …మొట్ట మొదట మంచు విష్ణు కలిసే మొదటి పొలిటికల్ సెలబ్రిటీ జగన్ అని ఎవరైనా చెప్పేదే కదా!