వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన చేపట్టిన అనేకానేక సంక్షేమ పథకాలు.. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు సైతం రోల్ మాడల్ అవుతున్నాయి.
స్థానికంగా రాజకీయ ప్రత్యర్థులు ఎంతగా బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. దేశంలో అనేక ప్రభుత్వాలు జగన్ మోడల్ సంక్షేమ పథకాల్ని కాపీ కొట్టడానికి, తద్వారా ప్రజల్లో చిరస్థాయిగా కీర్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
కేవలంసంక్షేమ పథకాల ద్వారా మాత్రమే కాదు.. వచ్చే 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధిం చేసే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్ లాగా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
పార్టీ కీలక నాయకులతో సమావేశం అయిన జగన్.. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే ఒక ప్రణాళికను బయటపెట్టారు.
రాష్ట్రంలో ప్రతి యాభై ఇళ్లకు పార్టీ తరఫున ఇద్దరేసి గృహసారథులను నియమించాలని సూచించారు. వారు నిత్యం తమ పరిధిలోని అన్ని ఇళ్ల వారితోనూ టచ్ లో ఉంటారు. వారిని పలకరిస్తుంటారు. వారి ద్వారా వారి ఇళ్లకు ప్రభుత్వ పథకాలు ఏమేం అందుతున్నాయో గమనిస్తుంటారు. వారికి ఇంకా ఏం అవసరమో తెలుసుకుని, గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై వారికి ఆయా పథకాలు అందేలా చూడడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వ్యవస్థ పార్టీ పరంగా ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు.
ఇప్పటికే ప్రతి యాభై ఇళ్లతో టచ్ లో ఉండడానికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉంది. అయితే ఆ వ్యవస్థ ప్రభుత్వ పరమైనది. వారితో పార్టీ పని చేయించడం అనవసరం అనే ఉద్దేశంతో.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ పనులకు వాడుకుంటున్నామనే అపప్రధ రాకుండా ఉండాలనే ఆలోచనతో.. జగన్ ‘గృహసారథుల’ ప్రణాళికను సిద్ధం చేశారు.
నిజానికి ఇది అద్భుతమైన ఆలోచన. ఈరోజుల్లో మనిషి ఇరుగుపొరుగు ఇళ్లలోని మనిషి ఎదురుపడినా కూడా.. పలకరించే వారే కరవైపోతున్న రోజుల్లో.. ఎవరికి వారి తమ స్వార్థం చుట్టూ గిరిగీసుకుని బతుకుతున్న రోజుల్లో యాభై ఇళ్లను పలకరించే ఒక మహిళ, ఒక మగ కార్యకర్తలను పార్టీ కోసం నియమించడం గొప్ప విషయం. అధికారంలో ఉన్న పార్టీ తరఫున పలకరించే వ్యక్తులుండడం విశేషం.
గెలిచిన తర్వాత.. ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తిప్పుతూ.. వారి సమస్యలు తెలుసుకునే, తీర్చే ప్రయత్నం చేస్తున్న జగన్.. ఈ గృహసారథుల ద్వారా.. అనునిత్యం ప్రతి యాభై ఇళ్లకు అందుబాటులో ఉండే క్రియాశీల కార్యకర్తలను తయారుచేస్తున్నారు.ఎన్నికల సమయానికి వీరు పార్టీకి అనుకూలతను నిర్మించడంలో ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తారనేది అంచనా.
నిజానికి జగన్ మోహన్ రెడ్డి ఎంతో శాస్త్రీయ దృక్పథంతో ఈ గృహసారథుల ఆలోచనను చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రతి రోజూ, అవసరమైన ప్రతి సందర్భంలో తమ బాగోగులను విచారించే ఒక మనిషి ఉన్నప్పుడు.. ఆ మనిషి ప్రభావం పార్టీకి ఖచ్చితంగా మేలు చేస్తుంది.
వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి.. గ్రామ పరిపాలనను ఇంటింటికీ అందుబాటులో ఉండేలా విప్లవాత్మక ఆలోచన చేసినప్పుడు విపక్షాలు విషం కక్కాయి. ఎన్నికలకు వాడుకోవడానికి వాలంటీర్లను తెచ్చారని అన్నారు. ఈ విమర్శలను జగన్ ఏనాడూ పట్టించుకోలేదు. కాకపోతే.. ఆ విమర్శలకు ఇప్పుడు శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టేస్తూ.. పార్టీకోసం వాలంటీర్ల సేవలు వాడబోననే సంకేతాలు అందిస్తూ.. అందుకోసం ప్రత్యేకంగా గృహసారథుల నియామకం అనేది సత్ఫలితాలు ఇస్తుంది.
పార్టీలో కీలక కార్యకర్తలుగా గుర్తించడంతో పాటు, గృహసారథులు ప్రతి ఒక్కరికీ ఉచిత జీవితబీమా చేయిస్తూ జగన్ వారికోసం తన శ్రద్ధను కనబరుస్తున్నారు. ఈ సైంటిఫిక్ అప్రోచ్ భవిష్యత్తులో ఇతర పార్టీలకు రోల్ మాడల్ అవుతుందనడంలో సందేహం లేదు.