కొన్నాళ్ల కిందటి సంగతి.. యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ అభిమాని ఒకడు సూసైడ్ నోట్ రాశాడు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా అప్ డేట్స్ ఇవ్వనందుకు నిరసనగా తను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన ఆత్మహత్యకు యూవీ క్రియేషన్స్, దర్శకుడు రాధాకృష్ణ బాధ్యత వహించాలని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు. ఇప్పుడు అలాంటిదే మరో లెటర్ ప్రత్యక్షమైంది.
ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ కు ఉత్తరం రాసింది ఓ అభిమాని. అయితే అది కేవలం ఉత్తరం మాత్రమే కాదు, అదొక సూసైడ్ లెటర్.
“హరీశ్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు.. సర్, ఇంతవరకు ఒక్క లెటర్ కూడా రాయని నేను, సూసైడ్ లెటర్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు ఎన్ని రీమేక్స్ తీసినా ఎప్పుడూ ఇంత ఫీల్ అవ్వలేదు. కానీ తేరి రీమేక్ అని తెలిసిన తర్వాత రాయక తప్పలేదు. కనీసం నా చావును చూసైనా తేరి రీమేక్ ను కాన్సిల్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది ప్రతి ఆదివారం స్టార్ మా ఛానెల్స్ లో టైమింగ్స్ మారుస్తూ టెలికాస్ట్ చేస్తారు. ప్లీజ్ ఈ ప్రాజెక్టు కాన్సిల్ చేయండి. నా చావుకు కారణం మైత్రీ మూవీ మేకర్స్ టీమ్, డైరక్టర్ హరీశ్ శంకర్. చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోకండి.”
దివ్యశ్రీ అనే అభిమాని మైత్రీ+హరీశ్ కు కలిపి రాసిన సూసైడ్ నోట్ ఇది. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది. తేరి రీమేక్ వద్దంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను పవన్ ఫ్యాన్స్ ఏకంగా ట్రెండ్ చేశారు. ఇప్పుడీ అంశాన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లింది ఈ సూసైడ్ లెటర్.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ లెటర్ ను బండ్ల గణేశ్ రీట్వీట్ చేశారు. ఇలాంటి సూసైడ్ లెటర్లు రాయొద్దని, దయచేసి అంతా వెయిట్ చేయాలని, పవన్ కల్యాణ్ తో బ్లాక్ బస్టర్ సినిమా తీస్తానని ప్రకటించాడు.