వకీల్ సాబ్..భీమ్లా నాయక్..రెండు రీమేక్ లు చేసారు పవన్. ఆ మాటకు వస్తే అంతకు ముందు ఇంకా ఇంకా చేసారు. ఇప్పుడు మళ్లీ మరో సినిమా రీమేక్ అని వినిపిస్తుండేసరికి పవన్ ఫ్యాన్స్ కిందా మీదా అయిపోతున్నారు.
తెరి రీమేక్ వద్దు కాక వద్దు అంటూ ట్విట్టర్ ట్రెండింగ్ చేసేసారు. తెరి సినిమా రీమేక్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గత వారం రోజులుగా వార్తలు వినిపించడం ప్రారంభమైంది.
లేటెస్ట్ గా తన సినిమా ప్రకటన రాబోతున్నట్లు హరీష్ శంకర్ ఇన్ డైరెక్ట్ గా ఓ ట్వీట్ వేసారు. అక్కడి నుంచి ఇక ఫ్యాన్స్ గడబిడ మొదలైంది. తెరి రీమేక్ వద్దు గాక వద్దు అంటూ ట్వీట్ ల వర్షం కురిపిస్తున్నారు. ఇలా కురిపించిన ట్వీట్ లు రెండులక్షలు దాటేసాయి. దాంతో ఈ రోజు ట్విట్టర్ లో ట్రెండింగ్ అయిపోయిందీ టాపిక్.
తెరి రీమేక్ గొడవ ఇవాల్టిది కాదు. ఈ సినిమా రైట్స్ మైత్రీ మూవీస్ కొని, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చేతిలో పెట్టారు. ఆయన చాలా కాలం దాని మీద వర్క్ చేసి స్క్రిప్ట్ తయరు చేసారు. కానీ అప్పట్లో పవన్ సినిమాలు చేసే మూడ్ లో లేకపోవడంతో, సంతోష్ శ్రీనివాస్ కు కొంత రెమ్యూనిరేషన్ ఇచ్చి పంపేసారు. ఇంతలో ఈ మధ్యన దర్శకుడు సుజిత్ దీని మీద వర్క్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.
కానీ సుజిత్ వేరే కథను చేసుకున్నారు. తెరి రీమేక్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీన్ని హరీష్ శంకర్ తన స్టయిల్ లో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వినిపించడంతో పవన్ ఫ్యాన్స్ గడబిడ మొదలెట్టేసారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.