రా తేల్చుకుందాంః విజ‌య‌సాయి ప్ర‌తిసవాల్‌

లోకేశ్‌కు మ‌రో ఇర‌కాటం. రాజ‌కీయ స‌వాల్‌కు ప్ర‌త్య‌ర్థులు స్పందించ‌ర‌ని లోకేశ్ భావించిన‌ట్టున్నారు. అయితే వైసీపీ ఊరుకోలేదు. సై అంటూ ప్ర‌తి స‌వాల్ విస‌ర‌డంతో టెన్త్ ఫ‌లితాల వ్య‌వ‌హారం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. టెన్త్ విద్యార్థులు, వారి…

లోకేశ్‌కు మ‌రో ఇర‌కాటం. రాజ‌కీయ స‌వాల్‌కు ప్ర‌త్య‌ర్థులు స్పందించ‌ర‌ని లోకేశ్ భావించిన‌ట్టున్నారు. అయితే వైసీపీ ఊరుకోలేదు. సై అంటూ ప్ర‌తి స‌వాల్ విస‌ర‌డంతో టెన్త్ ఫ‌లితాల వ్య‌వ‌హారం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. టెన్త్ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌తో లోకేశ్ గురువారం జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ కాన్ఫ‌రెన్స్‌లోకి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌వేశించారు. దీంతో ఒక్క‌సారిగా లోకేశ్ షాక్‌కు గుర‌య్యారు. వైసీపీ నేత‌ల వీడియో కాల్స్‌ని క‌ట్ చేశార‌ని తెలిసిన త‌ర్వాతే లోకేశ్ షాక్ నుంచి తేరుకున్నారు.

ఆ త‌ర్వాత తోకేశ్ త‌న మార్క్ ఉత్త‌ర‌కుమార్ ప్ర‌గ‌ల్భాలు చేశారు. ‘ జూమ్‌లో కాదు… నేరుగా వచ్చినా మీరేమీ చేయలేరు. పదో తరగతి ఫెయిలైన వైసీపీ కుక్కల్ని పంపడం కాదు! జగన్‌ రెడ్డీ…  స్వయంగా నువ్వే రా! పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందో నీ బ్లూ మీడియా సాక్షి చానల్‌లోనే చర్చించుకుందాం’ అని లోకేశ్‌ సవాల్‌ చేశారు. ఈ స‌వాల్‌పై వైసీపీ తీవ్రంగా స్పందించింది.

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి త‌న‌దైన శైలిలో స‌వాల్‌కు ప్ర‌తిస‌వాల్ విసిరారు. నిన్నటి ఘ‌ట‌న ఆరంభం మాత్ర‌మే అని హెచ్చ‌రించారు. విద్య‌కు సంబంధించి రాజ‌కీయాలు చేస్తే తీవ్ర ప‌రిణామాలు వుంటాయ‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. 

లోకేశ్ స‌వాల్‌ను స్వీక‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ముఖాముఖి కూచుందామ‌న్నారు. లోకేశ్ చెప్పాల్సింది చెప్పుకోవ‌చ్చ‌న్నారు. తాము చెప్పాల్సింది చెబుతామ‌న్నారు. అంతిమంగా ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకుంటార‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ఈ స‌వాల్ చంద్ర‌బాబునాయుడికి కూడా వ‌ర్తిస్తుంద‌ని విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు.

జామ్‌లో త‌మ వాళ్ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా లోకేశ్ పారిపోవ‌డం ఏంట‌ని నిల‌దీశారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఇది స‌రైంది కాద‌ని ఆయ‌న హిత‌వు చెప్పారు. త‌మ వాళ్లు జూమ్ మీటింగ్‌కు వ‌స్తే, ఎదుర్కోవాల్సింద‌న్నారు. విద్య‌పై దుష్ప్ర‌చారం చేస్తే మాత్రం ఇక మీద‌ట ఊరుకునే ప్ర‌శ్నే లేద‌న్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ త‌ప్ప‌ద‌ని ఆయ‌న‌ హెచ్చ‌రించారు. నిన్న టీడీపీ ప‌న్నాగాన్ని తిప్పి కొట్టామ‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.  

రెఫ‌రెండం అంటే అర్థం తెలియ‌ని లోకేశ్ కూడా అడుగుతున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. నిజంగా రెఫ‌రెండం కావాల‌ని కోరుకుని వుంటే ఆత్మ‌కూరులో ఎందుకు పోటీ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. త‌మ‌ను రాజీనామాలు చేయాల‌ని అడిగే హ‌క్కు ఎవ‌రిచ్చార‌ని విజయ‌సాయిరెడ్డి నిల‌దీశారు. విజ‌య‌సాయి స‌వాల్‌పై లోకేశ్ ఎలా స్పందిస్తారో చూద్దాం.