గ్రేస్ మార్కులు ఇవ్వండి, ఫెయిలైనవారందర్నీ పాస్ చేయండి అంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న వేళ, ప్రభుత్వం మాత్రం ఫెయిలైన వారిని పాస్ చేయించేందుకు ఎవ్వరికీ అభ్యంతరం లేని పద్ధతిని ఎంచుకుంది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పెట్టి, పాసైనవారితో పాటే గ్రేడ్లు ఇస్తామని ప్రకటించింది. అంతే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఫెయిలైనవారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఈనెల 13నుంచి ఫెయిలైనవారికి ఆయా స్కూళ్లలో తరగతులు మొదలవుతాయి. రోజుకి రెండు సబ్జెక్ట్ ల చొప్పున అన్ని సబ్జెక్ట్ లకూ రివిజన్ క్లాసులు జరుగుతాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు క్లాస్ లు జరుగుతాయి.
టెన్త్ క్లాస్ టీచర్లకు టైమ్ టేబుల్ వేయడం, ఫెయిలైన విద్యార్థులంతా క్రమం తప్పకుండా క్లాసులకు హాజరయ్యేలా చూడటం ప్రధానోపాద్యాయుల బాధ్యత. ఈనెల 13నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకు క్లాస్ లు జరుగుతాయని చెబుతున్నారు ఉన్నతాధికారులు. ఈ మేరకు సర్కులర్ జారీ చేశారు.
రెండేళ్ల పాటు వరుసగా పబ్లిక్ పరీక్షలు లేకపోవడం, మూడో ఏడాది కూడా కొవిడ్ కారణంగా తరగతులు సరిగా జరగకపోవడంతో ఈ ఏడాది టెన్త్ పాస్ పర్సంటేజీ బాగా తక్కింది. ఏపీలో మొత్తం 6,15,908మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,01,627మంది ఫెయిలయ్యారు. వీరందరి భవిష్యత్ కోసం ప్రభుత్వం ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తోంది.
ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన విద్యార్థులు ఇప్పటికే ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆ అవసరం లేకుండా ప్రభుత్వ స్కూల్స్ లోనే రెమెడియల్ తరగతులు మొదలుపెట్టేందుకు నిర్ణయించింది.
టైమ్ టేబుల్, అటెండెన్స్..
ఆయా స్కూల్స్ లో ఫెయిలైన విద్యార్థులకు అనుగుణంగా ప్రతి రోజూ క్లాసులు జరిగేటట్టు టైమ్ టేబుల్ వేసే బాధ్యత హెడ్మాస్టర్లకు అప్పగించారు. ఫెయిలైన విద్యార్థులంతా తరగతులకు హాజరయ్యేలా డీఈవోలు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఏరోజుకారోజు ఆన్ లైన్ లో అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఫెయిలైన విద్యార్థులంతా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసయ్యేలా, ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.