టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లోకి వైసీపీ నేతలు చొరబడ్డారని ఆ పార్టీ విమర్శిస్తోంది. జూమ్ కాన్ఫరెన్స్‌లో లోకేశ్‌తో టెన్త్ పరీక్ష ఫలితాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రయత్నించడం వివాదాస్పదమైంది. దీనిపై ఎవరికి తోచినట్టు వారు విశ్లేషిస్తున్నారు.
ఎమ్మెల్యేలతో లోకేశ్ మాట్లాడి వుంటే బాగుండేదనే అభిప్రాయాలే ఎక్కువ. అయితే వంశీ, కొడాలి నాని చొరబడ్డారనే టీడీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో… అసలు ఆ పదానికి అర్థమేంటో నెటిజన్లు కొన్ని అంశాల్ని తెరపైకి తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అలాగే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు భూమా అఖిలప్రియ వ్యవహరించిన తీరును నెటిజన్లు సమయం, సందర్భం చూసి వివరించడం విశేషం.
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన కుటుంబంపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీనంతటికి తన ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డే కారణమని పెద్దారెడ్డి భావించారు. దీంతో ఏకంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి పెద్దారెడ్డి వెళ్లడాన్ని చొరబాటుగా నెటిజన్లు విశ్లేషించడం గమనార్హం.
రాజకీయంగా కంటే వ్యక్తిగతంగా జేసీ, పెద్దారెడ్డి కుటుంబాల మధ్య తీవ్రమైన వైరం ఉన్న నేపథ్యంలో, ఈ ఘటన చోటు చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. పెద్దారెడ్డి దుందుడుకుతనాన్ని రాజకీయాలకు అతీతంగా తప్పు పట్టారు. ఎందుకంటే పెద్దారెడ్డి వెళ్లిన సమయానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఉండింటే ఏం జరిగేదో అనే చర్చకు తెరలేచింది.
ఇక భూమా అఖిలప్రియ విషయాన్ని కూడా ప్రధానంగా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్‌లో భూవివాద నేపథ్యంలో ఏకంగా కిడ్నాప్‌నకు తెగబడిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ కేసులో అఖిలప్రియ రోజుల తరబడి తెలంగాణ జైల్లో గడపడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
ఇటీవల కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తన చిన్నమ్మ భూమా శోభ, చిన్నాన్న నాగిరెడ్డిల విగ్రహాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయాలని బీజేపీ ఇన్చార్జ్ కిషోర్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. విగ్రహాల ఆవిష్కరణకు ముహూర్తం పెట్టుకున్నారు. అయితే ఆహ్వానం లేకుండానే కొంత మంది అనుచరులతో వెళ్లిన అఖిలప్రియ, తమ్ముడు జగత్‌విఖ్యాత్ … విగ్రహాలను ఆవిష్కరించి వివాదానికి తెరలేపారు. మరి దీనిపై టీడీపీ ఎందుకు స్పందించలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అఖిలప్రియ, ఆమె తమ్ముడు చేసింది తప్పని నాడు చెప్పి వుంటే పార్టీకి గౌరవంగా ఉండేదని గుర్తు చేస్తున్నారు.
గతంలో అఖిలప్రియ వైఖరిని టీడీపీ ఖండించి వుంటే, కనీసం నేడు వంశీ, నాని వ్యవహారాలను తప్పు పట్టే నైతిక హక్కు వుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమకైతే ఒక నీతి, ప్రత్యర్థులకు మరో నీతి అన్నట్టుగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తుండడం వల్లే ఏ మాత్రం విలువ లేకుండా పోయింది. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. దొందు దొందే.