బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్‌ఖేర్ అంటే దేశ వ్యాప్తంగా సినిమా అభిమానులకు సుపరిచితమైన పేరు. తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశాడు. అందులో చిన్న పిల్లాడి మాదిరిగా ఆయన ఏడ్వడం ప్రతి ఒక్కర్నీ కదిలించింది. కరోనా మహమ్మారి మున్ముందు చేసే విధ్వంసంపై ఆయన కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవల ఆయన కుటుంబంలో ఏకంగా నలుగురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వృద్ధురాలైన అనుపమ్‌ఖేర్ తల్లి కూడా కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. కరోనా బారిన కుటుంబాల బాధను అనుభవించిన వ్యక్తిగా తన ఆందోళనను ఆ వీడియోలో వ్యక్తీకరించారు. కరోనా కట్టడికి ఇంకా వ్యాక్సిన్ రాలేదంటూ అనుపమ్ ఖేర్ బోరుమని ఏడ్చాడు.
సమాజ బాధ ఆయన స్పందనలో ఆవిష్కృతమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాలుగా కరోనా మహమ్మారి కన్నీటిని మిగిల్చిన విషయం తెలిసిందే. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో మున్ముందు దాని దుర్మార్గాలు మరెన్ని చూడాలోననే ఆందోళన, భయం సమాజానికి నిద్రలేని రాత్రులు మిగుల్చుతోంది.
వ్యాక్సిన్ లేకుండానే ఏప్రిల్, మే, జూన్ మాసాలు గడిచిపోయాయని, ఇప్పటికైనా వ్యాక్సిన్ కనుగొనాలంటూ ఆయన కన్నీళ్లతో వేడుకోవడం ప్రతి హృదయాన్ని ద్రవింపజేసింది. వ్యాక్సిన్ లేకపోతే సమాజం అంధకారమే అని ఆవేదన వ్యక్తం చేశారు. అనుపమ్ ఖేర్ ఏడుస్తూ చేసిన అభ్యర్థన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.