వీర్రాజు తలపై ముళ్ల కిరీటం

కన్నా వెళ్లారు.. వీర్రాజు వచ్చారు. రాజు మారాడు, మరి రాజ్యం మారుతుందా? సరిగ్గా ఇక్కడే సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీర్రాజు రాకతో ఏపీ బీజేపీలో పెద్దగా మార్పులు రావని కొందరు చెబుతుంటే.. కేవలం వ్యూహాత్మకంగానే…

కన్నా వెళ్లారు.. వీర్రాజు వచ్చారు. రాజు మారాడు, మరి రాజ్యం మారుతుందా? సరిగ్గా ఇక్కడే సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీర్రాజు రాకతో ఏపీ బీజేపీలో పెద్దగా మార్పులు రావని కొందరు చెబుతుంటే.. కేవలం వ్యూహాత్మకంగానే అధిష్టానం వీర్రాజును రంగంలోకి దించిందనేది మరికొందరి వాదన.

సాధారణంగా ఏ పార్టీకైనా ప్రధాన వైరిపక్షం ఒకటే ఉంటుంది. కానీ ఏపీలో బీజేపీ పరిస్థితి వేరు. ఇక్కడ ఆ పార్టీకి రెండు ప్రతిపక్షాలు. ఓవైపు జగన్ పై విమర్శలు చేస్తూనే, మరోవైపు టీడీపీని కూడా చెడుగుడు ఆడుకోవాలి. ఈ రెండు అంశాలు రెండు భిన్న ధృవాల్లాంటివి. వీటిని వీర్రాజు ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఆసక్తికరం. ఈ విషయంలో కన్నా ఫెయిలయ్యారు.

అయితే కొత్త బీజేపీ అధ్యక్షుడు ఈ విషయంపై ముందే క్లారిటీ ఇచ్చారు. టీడీపీపై, చంద్రబాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అదే సమయంలో వైసీపీపై కూడా ఆయన విమర్శలు చేశారు. కానీ ప్రతి అంశంలో ఇలా ఈ రెండు పార్టీల్ని ఒకే గాటన విమర్శించడం బీజేపీ కి సాధ్యం కాదు. ఉదాహరణకు ప్రత్యేకహోదా అంశాన్నే తీసుకుంటే వైసీపీని విమర్శిస్తే, టీడీపీకి మద్దతిచ్చినట్టవుతుంది. పోనీ టీడీపీని తిడితే వైసీపీని సపోర్ట్ చేసినట్టవుతుంది. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి.

ఇవన్నీ ఒకెత్తయితే.. మిత్రపక్షం జనసేనను కూడా కలుపుకొని ముందుకెళ్లడం సోము వీర్రాజుకు కత్తిమీద సాము. పైకి మిత్రత్వం కనిపిస్తున్నప్పటికీ అంశాల వారీగా చూస్తే బీజేపీ-జనసేన మధ్య కొన్ని కుప్పలుతెప్పలుగా అభిప్రాయబేధాలున్నాయి. ఇప్పటికే కొన్ని విషయాల్లో తన మాట చెల్లక, మనోహర్ పేరిట పవన్ ప్రెస్ నోట్లు రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి.  

పార్టీల పరంగా సోము వీర్రాజుకు ఎదురుకాబోతున్న కష్టాలివి. ఇక వ్యవస్థాగతంగా చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం వీర్రాజు వల్ల కాదు కదా, మోడీ వల్ల కూడా కాదు. ఎందుకంటే.. ఏపీలో బీజేపీ భావజాలానికి ఓట్లు రాలవు. ఉత్తరాదిన హిందుత్వవాదం బీజేపీకి పెట్టని కోట. అదే వాదం, భావజాలం ఏపీలో బీజేపీకి వర్కవుట్ అవ్వవు. కనీసం తెలంగాణలో బీజేపీకి ఉన్న ప్రాతిపదిక కూడా ఏపీకి వర్తించదు.

ఏపీ ప్రజలు కులాలు చూస్తారు తప్ప మతాలు చూడరు. ఇక్కడే బీజేపీకి, వీర్రాజుకు చిక్కొచ్చి పడింది. పోనీ మతాల్ని వీడి, కులాల ప్రాతిపదికగా రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆ పనిని చంద్రబాబు కొన్ని దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు. ఇక అక్కడ చేయడానికేం మిగల్లేదు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలంటే జాతీయస్థాయిలో నేతలు ఎత్తుకుంటున్న వ్యూహాల్ని, ఏపీలో అమలు చేయకూడదు. స్థానికంగా ప్రత్యేక ఎజెండా ఉండాలి. ఇది లేకపోవడం వల్లనే టీడీపీ భూస్థాపితమైనా ఆ పార్టీకి చెందిన క్రియాశీల నేతలెవ్వరూ బీజేపీ వైపు వెళ్లడం లేదు. సరైన నేతలు లేనప్పుడు.. అధ్యక్షులు ఎంతమంది మారినా ఫలితం మారదనే విషయం అందరికీ తెలిసిందే.

ఈ సమస్యలకు తోడు ప్రత్యేక హోదా అనే అంశం బీజేపీకి ఎప్పుడూ పక్కలో బల్లెమే. స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ ఎంత పాపం చేసిందో.. ఆ పాపంలో సగం వాటా ఎప్పుడూ బీజేపీకి చెందుతుంది. ఈ అంశం నుంచి ప్రజల్ని మళ్లించేందుకు, ఈ అంశాన్ని మరుగున దాచేందుకు బీజేపీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఎందుకంటే, ఏపీ ప్రజల నరనరాల్లో ప్రత్యేక హోదాకు సంబంధించి బీజేపీపై వ్యతిరేకత ఉంది. ఒకవేళ వాళ్లు కాలక్రమేనా మరిచిపోతున్నా గుర్తుచేయడానికి వైసీపీ ఎలాగూ ఉంది.

ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీకి ఎవరు నాయకత్వం వహించినా పెద్దగా ఒరిగేదేం ఉండదు. వీర్రాజు పెద్దగా సాధించేదేం ఉండదు, కన్నా సాధించింది కూడా ఏం లేదు.  ఈ ముళ్ల కిరీటం అలా ఒకరి తలపై నుంచి మరో తలపైకి మారుతుంటుందంతే.

పేషేంట్లకి బెడ్ ఇవ్వలేకపోతే మనం మనుషులమే కాదు

త‌ప్పంతా నాదే…రోజా నాకు అక్క లాంటిది