మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల రచ్చ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. వీళ్లు వాళ్లు అనే తేడా లేకుండా ఎవరు మైలేజీకి ఉపయోగపడితే వాళ్లను ఎన్నికల్లోకి లాగేస్తున్నారు. నిన్నటివరకు ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు తెరపైకొచ్చింది.
''మా'' ఎన్నికల లొల్లిలో ప్రధాని పేరును నాగబాబు ముందుగా ప్రస్తావించారు. ఆయన ఇలా టచ్ చేసి అలా వదిలేస్తే.. ఇప్పుడు మంచు విష్ణు ఏకంగా తన వాడకం ఎలా ఉంటుందో రుచిచూపిస్తున్నారు.
ఇంతకీ నాగబాబు ఏమన్నారు..?
ప్రకాష్ రాజ్ ను ఆకాశానికెత్తే క్రమంలో నాగబాబు చాలా మాట్లాడేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ముందు కూర్చొని మాట్లాడేంత సామర్థ్యం ప్రకాష్ కు ఉందన్నారు. ఆయన అధ్యక్షుడు ''మా'' అధ్యక్షుడు అయిన తర్వాత, అవసరమైతే పరిశ్రమ సమస్యల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తారని, మోదీతో కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడతారని అనేశారు.
అసలు పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయి వరకు, మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రి వరకు వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా నాగబాబు మాట్లాడేశారు.
నాగబాబుకు ''మంచు'' కౌంటర్
నాగబాబే కాస్త అతిగా మాట్లాడారనుకుంటే.. ఇప్పుడు దాన్ని పరాకాష్టకు తీసుకెళ్లారు మంచు విష్ణు. తను కూడా మోదీతో కూర్చోగలనని సవాల్ విసిరారు. గడిచిన 6-7 ఏళ్లలో మోదీని ప్రకాష్ రాజ్ ఎన్నిసార్లు కలిశారా.. మంచు ఫ్యామిలీ సభ్యులు ఎన్నిసార్లు కలిశారో లెక్కలేసుకోవాలని ప్రత్యర్థి ప్యానల్ కు సూచించారు మంచు విష్ణు.
మోదీ దగ్గరకు ఎవరెళ్లి మాట్లాడగలరు.. ఎవరికి అపాయింట్ మెంట్లు దొరుకుతాయనే విషయం ప్రజలకు బాగా తెలుసన్నారు. అవసరం అనుకుంటే మోదీని ఇలా వెళ్లి అలా కలిసొస్తా అన్నట్టు స్పందించాడు విష్ణు.
మొత్తమ్మీద ''మా'' ఎన్నికల్లోకి ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోదీని కూడా లాగేశారు. ప్రచారానికి ఇంకా 2 రోజులు టైమ్ ఉంది. ఈ 2 రోజుల్లో అమెరికా అధ్యక్షుడ్ని, ఐక్యరాజ్యసమితిని కూడా ఈ సినిమా జనాలు వాడేస్తారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.