ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత హీరో వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు.
కొండపొలం అనే అంశమే కొత్తది. నేను ఎప్పుడూ వినలేదు. పైగా క్రిష్ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మేకింగ్ అంటే ఇంకా ఇష్టం. కొత్త కథ చెప్పాలని అనుకున్నారు. అందుకే ఈ కథను ఓకే చేశాను. కొండపొలం సినిమాలో కమర్షియల్ అంశాలు ఉంటాయి. మంచి సందేశాత్మక చిత్రం కూడా. రంగస్థలం నుంచి అందరూ సినిమాను చూసే కోణం మారిపోయింది. కొండపొలంలో ప్రతీ ఒక్క ఎమోషన్ ఉంటుంది.
నా మూడో సినిమాగా కమర్షియల్, లవ్ స్టోరీ చేస్తున్నాను. అందులో నా లుక్ వేరేలా ఉంటుంది. కరోనా సమయంలో ఇంట్లోనే ఉండడం వల్ల వెంటనే షూటింగ్ చేయడం మరీ అంత కష్టంగా ఏమీ అనిపించలేదు. కొండలు ఎక్కేవాళ్లం, రెండు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్లం. అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ ఆ ఎండల్లో రోజంతా మాస్కులు పెట్టుకుని ఉండటం రెండు మూడు రోజులు కష్టంగా అనిపించింది. కానీ ఆ తరువాత అలవాటైపోయింది.
ఏమీలేని స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగే ఓ కుర్రాడి కథ. అడవి అంటే ఇష్టం, ఆ అడవి, అక్కడి అమ్మాయితో ప్రేమలో పడే కుర్రాడి జీవిత ప్రయాణం, ఆ గ్రాఫ్ బాగుంటుంది. ఈ కథ, పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో పూర్తిగా అక్కడి యాసలో మాట్లాడాను. ఉప్పెనలో కొన్నిచోట్ల ప్రేక్షకులకు అర్థం కాదని యాస వాడలేదు. కానీ కొండపొలంలో పూర్తిగా అక్కడి యాసలోనే మాట్లాడాను.
మొదట్లో గొర్రెల భాషను అర్థం చేసుకోలేకపోయాను. తలపొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు కూడా నడుస్తాయి. వాటికి పచ్చళ్లు అంటే ఇష్టమని తరువాత తెలిసింది. దాంతో ఆ పికిల్స్‌తో వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాం.
రిపబ్లిక్ చిత్రంలో అన్నయ్య ఐఏఎస్, నేను ఇందులో ఐఎఫ్ఎస్. కానీ రిపబ్లిక్, కొండపొలం సినిమాకు సంబంధం ఉండదు. అన్నయ్య (సాయి ధరమ్ తేజ్) బాగున్నారు. త్వరగా కోలుకుంటున్నారు. ఇప్పుడు ఫిజియోథెరపీ జరుగుతోంది. తొందర్లనే బయటకు వస్తారు…అంటూ ముగించారు వైష్ణవ్ తేజ్.