కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కేంద్రంలో నాలుగేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. అది కూడా కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన పేరుని బీజేపీ పెద్దలే నేరుగా ఎంపిక చేశారని కూడా అంటారు.
అశోక్ కి అలా మోడీ దగ్గర కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక 2018 మొదట్లో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. అలా కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించారు. ఏది ఏమైనా మోడీ మీద అశోక్ కి ఈయన మీద ఆయనకూ ప్రత్యేక అభిమానం ఉందని ప్రచారం అయితే ఉంది.
ఇక మోడీ ఫోటోలతో బీజేపీ తాజాగా నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్ లో పాల్గొన్న అశోక్ చేసిన కామెంట్స్ ఆసక్తిగా ఉన్నాయి. మోడీ చాలా అంశాలలో స్పూర్తిగా నిలిచారు అంటూ ఆయన కితాబు ఇవ్వడం ఒక విధంగా రాజకీయ సంచలనమే.
అదే సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వ పనితీరు మీద కూడా కామెంట్స్ చేశారు. గ్యాస్ సహా వివిధ రకాలైన వాటి మీద కేంద్రం వడ్డిస్తున్న భారాలను తగ్గించుకోవాలని సూచించారు. విభజన హామీలను బీజేపీ ఏపీకి నెరవేర్చలేదు అని కూడా అశోక్ అనడమూ విశేషం.
మొత్తానికి చూస్తే మోడీ ది బెస్ట్ అంటున్న అశోక్ కేంద్ర పాలన మీద మాత్రం కొంత పెదవి విరుపుగానే మాట్లాడారు. మరి అశోక్ కామెంట్స్ బీజేపీ టీడీపీ సరికొత్త బంధానికి సూచిక కాదు కదా అన్న మాట అయితే వినవస్తోంది.