డ్రగ్స్ వినియోగం వ్యవహారంలో ఎన్సీబీ కస్టడీలో ఉన్న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా.. క్రూజ్ షిప్ లో ఏం జరిగిందనే అంశంపై తన వెర్షన్ ను వినిపించాడు. ఆర్యన్ ఖాన్, ఆయన తరఫు న్యాయవాది సతీష్ మనెషిండే ఈ మేరకు తమ వాదనను వినిపించారు. వారి వాదనలోని ప్రధానమైన అంశం.. క్రూజ్ షిప్ లో పట్టుబడిన డ్రగ్స్ తో ఆర్యన్ కు ఎలాంటి సంబంధం లేదనేది. క్రూజ్ షిప్ లో పార్టీకి తనకు ఆహ్వానం వచ్చిన మాట వాస్తవమే అని, అయితే అక్కడ ఏం జరుగుతోందో తనకు పూర్తిగా తెలియదని ఆర్యన్ ఖాన్ కోర్టుకు చెప్పుకున్నాడు.
క్రూజ్ షిప్ పార్టీకి తనకు మున్ మున్ ధమేచా నుంచి ఆహ్వానం వచ్చిందని ఆర్యన్ ఖాన్ చెప్పాడు. తను బాలీవుడ్ కు చెందిన వ్యక్తిని కాబట్టి గ్లామర్ కోసం తనను ఆహ్వానించి ఉంటారనుకున్నట్టుగా, వారి ఆహ్వానం మేరకు తను పార్టీకి వెళ్లినట్టుగా చెప్పాడు. పార్టీకి తనకు స్నేహితుడు అయిన అర్బాజ్ మర్చెంట్ కూడా వచ్చాడన్నాడు. అయితే అర్బాజ్ అక్కడకు వస్తున్న విషయం తనకు తెలియదని, షిప్ బయట కనిపిస్తే తామిద్దరం మాట్లాడినట్టుగా చెప్పాడు. ఆ సమయంలోనే ఎన్సీబీ అధికారులు తమ వద్దకు వచ్చారని, అర్బాజ్ వద్ద ఆరు గ్రాముల చరాస్ పట్టుబడినట్టుగా ఆర్యన్ వివరించాడు.
అర్బాజ్ తనకు స్నేహితుడే అని, అతడితో స్నేహం లేదని తను చెప్పడం లేదని, అయితే అతడి వద్ద డ్రగ్స్ ఉన్న విషయం తనకు తెలియదని, తను అర్బాజ్ తో మాట్లాడుకుని అక్కడకు రాలేదని, యాధృచ్చికంగా అతడితో మాట్లాడినట్టుగా ఆర్యన్ వివరించాడు. అర్బాజ్ వద్ద డ్రగ్స్ పట్టుబడటంతో.. తనను కూడా ఎన్సీబీ అధికారులు అక్కడ నుంచి పట్టుకొచ్చారని ఆర్యన్ కోర్టుకు చెప్పుకున్నాడు.
ఇక రెండు రోజుల పాటు తనను కస్టడీలో ఉంచుకున్నా.. ఎన్సీబీ అధికారులు తనను విచారించింది ఏమీ లేదని ఆర్యన్ కోర్టుకు చెప్పడం గమనార్హం. తన ఫోన్ వారి వద్దే ఉందని.. వాట్సాప్ చాట్ ఆధారంగా తను పార్టీకి ఎలా వచ్చిందీ పరిశీలించుకోవచ్చని ఆర్యన్, ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇలా తనకే పాపం తెలియదన్నట్టుగా ఆర్యన్ కోర్టుకు విన్నవించుకున్నాడు. తన పక్కనోడి వద్ద డ్రగ్స్ ఉండటంతో.. తనను కూడా ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారనేది ఆర్యన్ చెబుతున్న మాట.
ఇక ఎన్సీబీ వాదన విషయానికి వస్తే.. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదని వారు మొదటే చెప్పారు. ఆర్యన్ స్నేహితుల వద్ద డ్రగ్స్ ఉన్నాయనేది అభియోగం. అలాగే ఆర్యన్ వాట్సాప్ చాట్ ను పరిశీలిస్తే ఒక డ్రగ్స్ సప్లయర్ తో అతడు చాట్ చేశాడనేది ఆ తర్వాత మోపిన అభియోగం. దానిపై విచారణ జరగాలని.. వారు అంటున్నారు. ప్రస్తుతానికి ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దక్కలేదు. రేపు మరోసారి అతడి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.