ఇప్పటికే బెల్ట్ షాపులు మూయించారు. పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నడుపుతోంది. అందులో పనిచేసేవాళ్లు కూడా ప్రభుత్వం తరఫున రిక్రూట్ అయిన వాళ్లే. వ్యక్తిగత నిల్వ, కొనుగోళ్ల కెపాసిటీని కూడా తగ్గించింది. మద్యం షాపుల సమయాల్ని కూడా కుదించింది. ఇలా మద్యపాన నిషేధం దిశగా ఎక్కడికక్కడ భారీ చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కార్, ఇప్పుడు రాష్ట్రంలో బార్లపై కూడా ఓ కన్నేసింది.
వైన్ షాప్స్ లానే బార్ల సమయాన్ని కూడా కుదించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం బార్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతున్నాయి. చాలాచోట్ల అనధికారికంగా 11 తర్వాత కూడా మరో గంట అదనంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీటిపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది.
ఇకపై బార్ల సమయాల్ని కూడా కుదించబోతున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎలాంటి సమయాలు నిర్దేశిస్తే, రాత్రి 10 గంటలకల్లా బార్లన్నీ మూసుకుంటాయో ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాత్రి వేళల్లో బార్ల పరిసర ప్రాంతాల్లో గస్తీ చేపట్టాల్సిన అవసరం లేకుండా, పనిభారం తగ్గేలా పటిష్టమైన సమయాల్ని నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నారు.
దీనిపై ఇప్పటికే 2-3 రకాల టైమ్ స్లాట్స్ ను నిర్ణయించారు. వీటి సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలపై ఓ నివేదిక తయారుచేసి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ టేబుల్ పై పెట్టబోతున్నారు. బార్ల టైమింగ్స్ పై కూడా నియంత్రణ వస్తే మద్యపాన నిషేధం దిశగా మరో ముందడుగు పడినట్టవుతుంది.