బీజేపీ మీడియా పులులెక్క‌డ‌?

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌కు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఈ నెల 23న ఎన్నిక‌లు, 26న ఫ‌లితాలు. ఎన్నిక‌లకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు జ‌న‌సేన, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం బ‌రిలో…

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌కు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఈ నెల 23న ఎన్నిక‌లు, 26న ఫ‌లితాలు. ఎన్నిక‌లకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు జ‌న‌సేన, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం బ‌రిలో నిలిచింది. బీజేపీ మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన మ‌ద్ద‌తు ఎవ‌రికో తేల్చి చెప్ప‌లేదు. జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇస్తుంద‌నే ఆశతో బీజేపీ వుంది. పేరుకు మాత్రం బీజేపీ, జ‌న‌సేన పొత్తులో ఉన్నాయే త‌ప్ప‌, వాటి మ‌ధ్య సంబంధాలు  అలా లేవు.

ఆత్మ‌కూరులో బ‌లంతో సంబంధం లేకుండా బీజేపీ బ‌రిలో నిల‌బ‌డ‌డం ఆశ్చ‌ర్య‌మే. క‌నీసం ఏజెంట్ల‌ను నిలుపుకునే ప‌రిస్థితి ఉందా? అంటే అనుమాన‌మే. బీజేపీ త‌ర‌పున గుండ్ల‌వ‌ల్లి భ‌ర‌త్‌కుమార్ పోటీలో ఉన్నారు. ఏపీ బీజేపీకి అధ్య‌క్షుడు కావ‌డం వ‌ల్ల సోము వీర్రాజు త‌న‌కు త‌ప్ప‌ద‌న్న‌ట్టు ఆత్మ‌కూరు వెళ్లారు. మీడియా స‌మావేశాలు, ప్ర‌చారం నిర్వ‌హిస్తూ తాము పోటీలో ఉన్నామ‌ని ఉనికి చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ బీజేపీ మీడియా పులులు ఎక్క‌డున్నార‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. తిన‌డానికి తిండి లేదు, మీసానికి సంపెంగ నూనె అనే చందంగా తాముంటున్న వీధుల్లో కూడా గుర్తింపులేని, ఓట్లు రాబ‌ట్టుకోని బీజేపీ నాయ‌కుల‌కు జాతీయ‌, రాష్ట్ర ప‌ద‌వులు అలంకార‌ప్రాయం అని చెప్ప‌క త‌ప్ప‌దు. “ఏయ్ వైసీపీ నాయ‌కుల్లారా ఖ‌బ‌డ్దార్‌. మిమ్మ‌ల్ని దింపి మేమే అధికారంలోకి వ‌స్తాం” అని ఢిల్లీ నుంచి స‌త్య‌కుమార్ అనే నాయ‌కుడు రంకెలేస్తుంటాడు. లంకా దిన‌క‌ర్ అనే టీడీపీ-బీజేపీ ఉమ్మ‌డి నాయ‌కుడొకాయ‌న ఉన్నాడు. అదేంటో గానీ, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఈయ‌న ప్ర‌క‌ట‌న‌లు మాత్ర‌మే ఎల్లో మీడియాలో వ‌స్తుంటాయి. అలాగే తిరుప‌తి విమానాశ్ర‌యంలో భానుప్ర‌కాశ్‌రెడ్డి అని మ‌రొకాయ‌న ఉంటారు.

ఈయ‌న్ను ప్రొటోకాల్ లేదా బొకేలా భాను అని బీజేపీ నేత‌లే ముద్దుగా పిలుస్తుంటారు. ఈయ‌న టీవీలో త‌ప్ప‌, తిరుప‌తిలో ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తూ ఎప్పుడూ క‌నిపించ‌రు. ఇక బీజేపీ నాగ‌”భూష‌ణం” … అలియాస్ టీడీపీ నాగ‌భూష‌ణం గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. హార్డ్‌కోర్ టీడీపీ కార్య‌క‌ర్త‌. అంతోఇంతో ఎల్లో చాన‌ల్‌లో కొలకపూడి శ్రీనివాస్ చేతిలో చెప్పు దెబ్బ‌లు తిన్న విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డే న‌య‌మేమో! క‌నీసం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెంట న‌డుస్తూ, ఉన్నంత‌లో తిట్లు, త‌న్నులు తింటూ పార్టీ పేరును నిత్యం వార్త‌ల్లో ఉండేలా చూస్తుంటారు. బీజేపీ మీడియా పులుల మాట‌లు కోట‌లు దాటుతాయి కానీ, నాయ‌కులు మాత్రం న‌గ‌రాల నుంచి ప‌ల్లెల‌కు వెళ్ల‌రు. ఇలాగే పార్టీ బ‌లేప‌డేదెట్టా?

ఇక సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌, టీజీ వెంక‌టేష్‌, పురందేశ్వ‌రి, జీవీఎల్ న‌ర‌సింహారావు, క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌ లాంటి పెద్ద నాయ‌కులంతా పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల‌తో పాటు మీడియా మీటింగ్‌ల‌కే ప‌రిమితం అవుతుండ‌డంపై కూడా శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి ఈ మ‌ధ్య కొంచెం స్పీడ్ త‌గ్గించారు. ఆయ‌న మ‌న‌సులో ఏముందో బ‌య‌ట‌ప‌డ‌డం లేదు.

పార్టీని అడ్డు పెట్టుకుని ఆర్థికంగా ఎదిగిన బీజేపీ నాయకులంతా ఇప్పుడు ఏమ‌య్యారు? ఆత్మ‌కూరు ఉప ఎన్నిక ప్ర‌చారానికి ఎందుకు వెళ్ల‌డం లేదు. బీజేపీని, కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌ను పుష్క‌లంగా పొందిన వాళ్లు, ఇప్పుడు పార్టీకి అవ‌స‌ర‌మైన‌పుడు మాత్రం ఎందుకు క్షేత్ర‌స్థాయికి వెళ్ల‌డం లేదు? అనే ప్ర‌శ్న‌లు బీజేపీ శ్రేణుల నుంచి వ‌స్తు న్నాయి. ఆత్మ‌కూరులో బీజేపీ గెల‌వ‌లేద‌నే వాస్త‌వాన్ని చిన్న‌పిల్ల‌ల్ని అడిగినా చెబుతారు. క‌నీసం డిపాజిట్ అయినా ద‌క్కించుకుందామ‌ని ఆరాట‌ప‌డుతున్న బీజేపీ ఏపీ అధ్య‌క్షుడికి సొంత పార్టీ మీడియా పులుల నుంచి ఎందుకు మ‌ద్ద‌తు లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. 

ఇప్ప‌టికైనా బీజేపీ మీడియా పులులు కాస్త న‌గ‌రాల‌ను వ‌దిలి, ఆత్మ‌కూరు వెళ్లాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. క‌నీసం ఈ ప‌ది రోజులైనా పార్టీ కోసం ప‌ని చేసి రుణం తీర్చుకోవాల‌నే బీజేపీ శ్రేణుల డిమాండ్‌ను గౌర‌విస్తార‌ని ఆశిద్దాం.