అంటే.. నిడివి ఎక్కువైనా ఏం పర్వాలేదు!

పెద్ద నిడివితో సినిమాలు రావడం కొత్తకాదు. అర్జున్ రెడ్డి నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు అంటే సుందరానికి కూడా పెద్ద నిడివితో వస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ అక్షరాలా 2 గంటల…

పెద్ద నిడివితో సినిమాలు రావడం కొత్తకాదు. అర్జున్ రెడ్డి నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు అంటే సుందరానికి కూడా పెద్ద నిడివితో వస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ అక్షరాలా 2 గంటల 56 నిమిషాలు. దాదాపు 3 గంటల నిడివితో వస్తున్న ఈ సినిమా బోర్ కొట్టదా? ప్రేక్షకుల్ని అంతసేపు కుర్చీల్లో కూర్చోబెడుతుందా?

“వివేక్ ఫోన్ చేశాడు. 2 గంటల 56 నిమిషాలు లాక్ చేస్తున్నానన్నాడు. నేను ఒప్పుకోలేదు. వచ్చి సినిమా చూస్తానని చెప్పాను. పెన్ను, పేపర్ పట్టుకొని వెళ్లాను. ఎక్కడైనా ఓ 10 నిమిషాలు తగ్గిద్దామనే ఆలోచనతో వెళ్లి కూర్చున్నాను. సినిమా అంతా అయిపోయింది. పెన్ను పట్టుకునే అవసరం రాలేదు. నా గత సినిమాలకు సంబంధించి నేను ఎన్నో సీన్లు కట్ చేశాను. కథ డిస్టర్బ్ అవ్వదనుకుంటే, మంచి సీన్లు కూడా లేపేసిన సందర్భాలున్నాయి. కానీ అంటే సుందరానికి సినిమా విషయంలో ఆ పని చేయలేకపోయాను.”

ఇలా భారీ రన్ టైమ్ ను సమర్థించుకున్నాడు నాని. తగ్గించాలని ఫిక్స్ అయి వెళ్లినప్పుడు ఏ సినిమాకైనా కట్స్ చెప్పొచ్చని.. కానీ 'అంటే సుందరానికి' సినిమాకు మాత్రం కట్స్ చెప్పలేకపోయానని అన్నాడు. 

“గంటన్నర నిడివి ఉన్న సినిమా బోర్ కొడితే అది చాలా పెద్ద రన్ టైమ్ తో వచ్చినట్టు అర్థం. 3 గంటల సినిమా  చూసినప్పుడు బోర్ కొట్టకుండా, ఎప్పుడు పూర్తయిందో కూడా తెలియకపోతే అది పెర్ ఫెక్ట్ రన్ టైమ్. అంటే సుందరానికి సినిమా ఈ రెండో కేటగిరీలోకి వస్తుంది. సినిమా పెర్ ఫెక్ట్ లెంగ్త్ లో ఉంది.”

ఈరోజు థియేటర్లలోకి వచ్చింది అంటే సుందరానికి సినిమా. నాని-నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు.