సినిమాల పరంగా ఆమె ఎప్పుడూ టాలీవుడ్ ను పట్టించుకోలేదు. క్రేజీ ఆఫర్లు వచ్చినా కాదనుకుంది. కోలీవుడ్ కే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా ఆమె అదే పద్ధతి ఫాలో అయింది. తన పెళ్లికి కోలీవుడ్ ప్రముఖుల్ని ఆహ్వానించిన నయనతార, టాలీవుడ్ ప్రముఖుల్ని మాత్రం పక్కనపెట్టింది.
నయనతార పెళ్లికి రజనీకాంత్ హాజరయ్యారు. అటు బాలీవుడ్ నుంచి షారూక్ ఖాన్ కూడా వచ్చారు. కానీ టాలీవుడ్ నుంచి ఒక్కరంటే ఒక్క ప్రముఖుడు కూడా ఈ పెళ్లికి హాజరుకాలేదు. నయనతార నుంచి పిలుపు అందలేదని, అందుకే టాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లికి దూరంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
అటు నయనతార టీమ్ మాత్రం ఈ కామెంట్స్ ను తిప్పికొడుతోంది. కేవలం కొంతమందిని మాత్రమే నయనతార తన పెళ్లికి ఆహ్వానించిందని, చాలామంది టాలీవుడ్ ప్రముఖుల్ని రిసెప్షన్ కు ఆహ్వానించిందని చెబుతున్నారు. త్వరలోనే చెన్నైలో జరగనున్న రిసెప్షన్ లో టాలీవుడ్ సెలబ్రిటీలంతా కనిపిస్తారని అంటున్నారు.
ఈ కామెంట్స్, కౌంటర్లు పక్కనపెడితే.. టాలీవుడ్ నుంచి నయనతార పెళ్లికి సమంత కచ్చితంగా వెళ్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే, రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేశారు. అంతకు ముందు నుంచే ఇద్దరూ మంచి స్నేహితులు. కాబట్టి సమంత కచ్చితంగా ఎటెండ్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ ఈ కోణంలో కూడా టాలీవుడ్ కు ప్రాతినిథ్యం దక్కలేదు. కేవలం ఇనస్టాగ్రామ్ లో శుభాకాంక్షలు చెప్పి ఊరుకుంది సమంత.