పాంచాలి ద్రౌపది గురించి తెలుసు. ఆమెకు ఐదుగురు భర్తలు. కలియుగంలో ఒకరికి మించి ఇద్దరు లేదా ముగ్గురు భర్తలను మార్చిన వాళ్లను చూశాం, చూస్తున్నాం. వివాహ బంధం సవ్యంగా సాగని పరిస్థితుల్లో సహజంగా మగవాళ్లు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. కానీ ఓ మహిళ ఏకంగా తొమ్మిది మందిని పెళ్లాడింది. చివరికి తొమ్మిదో భర్త చేతిలో ఆ మహిళ జీవితం విషాదాంతమైంది. ఇది కథ కాని ఓ మహిళ యధార్థ జీవిత కథ.
కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీలో ఉంటున్నాడు. అతను క్యాబ్ డ్రైవర్. అదే ప్రాంతంలో వరలక్ష్మి అనే మహిళ నివాసం ఉండేది. ఆమె పెట్రోల్ బంకులో పనిచేసేది. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. కారుకు పెట్రోల్ పట్టించుకునే క్రమంలో ఆమెతో నాగరాజుకు పరిచయమైంది. క్రమంగా వాళ్లద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
రెండేళ్ల క్రితం భర్తను విడిచిపెట్టి నాగరాజుతో కలిసి జీవిస్తోంది. ఇటీవల వాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీనికి కారణం వరలక్ష్మి ఇతర వ్యక్తులతో సన్నిహితంగా మెలగడమే. ఇది సరైంది కాదని వరలక్ష్మిని నాగరాజు వారించాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు తన భార్య గొంతుకోసి చంపేశాడు.
అతను పారిపోవాలని ప్రయత్నించలేదు. నేరుగా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి భార్యను చంపిన విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు షాక్ నుంచి తేరుకుని రంగంలోకి దిగారు. పహాడీషరీఫ్ ఎస్ఐ కుమారస్వామి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూశాయి.
గతంలో వరలక్ష్మికి 8 మందితో పెళ్లిళ్లు జరిగాయని, నాగరాజుతో తొమ్మిదోదని తేల్చారు. పరాయి మగవాళ్లతో సన్నిహిత సంబంధాల వల్లే 8 పెళ్లిళ్లు పెటాకులయ్యాయని, చివరికి అదే కారణంతో తొమ్మిదో భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయి జీవితం విషాదాంతమైందని ఎస్ఐ తెలిపారు.