సినీ ఇండ‌స్ట్రీలో నెపొటిజం, కార‌ణం జ‌నాలు కాదా?

బాలీవుడ్ లో నెపొటిజం పెరిగిపోయింద‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో కూడా వాపోతూ ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం త‌ర్వాత కొంద‌రు సెల‌బ్రిటీల‌ను కొంద‌రు నెటిజ‌న్లు తీవ్రంగా ద్వేషిస్తూ ఉన్నారు. వారంతా వార‌సత్వంతో…

బాలీవుడ్ లో నెపొటిజం పెరిగిపోయింద‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో కూడా వాపోతూ ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం త‌ర్వాత కొంద‌రు సెల‌బ్రిటీల‌ను కొంద‌రు నెటిజ‌న్లు తీవ్రంగా ద్వేషిస్తూ ఉన్నారు. వారంతా వార‌సత్వంతో సినిమాల్లోకి వ‌చ్చార‌ని, వార‌సుల‌నే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నార‌ని, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు, వారిని తొక్కేస్తున్నారు అంటూ బాలీవుడ్ లోని కొంత‌మంది సెల‌బ్రిటీల‌ను సామాన్యులు కూడా ఇప్పుడు అస‌హ్యించుకుంటున్నారు.

ఇదంతా నిజ‌మే కావొచ్చు, అయితే బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా బంధుప్రీతి రాజ్యం ఏల‌డానికి ముఖ్య‌మైన కార‌ణం భార‌తీయుల మ‌న‌స్త‌త్వ‌మే అని స్ప‌ష్టం అవుతోంది. ఈ విష‌యాన్నే ఒక బాలీవుడ్ ఆర్టిస్ట్ కూడా ప్రస్తావించాడు. అందుకు అత‌డు ఒక ఉదాహ‌ర‌ణ కూడా చెప్పాడు. 

సైఫ్ అలీఖాన్- క‌రీనా క‌పూర్ ల కొడుకు తైమూర్ అలీఖాన్ ను అత‌డు పుట్టిన‌ప్ప‌టి నుంచి హిందీ జ‌నాలంతా క‌లిసి సెల‌బ్రిటీని చేశాడు. ఆ పిల్లాడు చాలా క్యూట్ గా ఉన్నాడంటూ..అంత‌టి క్యూట్ బాయ్ ఉండ‌నే ఉండ‌డు అన్న‌ట్టుగా ఆకాశానికి ఎత్తారు. సోష‌ల్ మీడియాలో అత‌డి పిక్స్ ను వైర‌ల్ గా మార్చారు. ఆ పిల్లాడిని పుట్ట‌గానే సెల‌బ్రిటీని చేశారు. త‌ల్లిదండ్రుల‌తో పాటు అత‌డు ఎక్క‌డైనా క‌నిపిస్తే చాలు.. విప‌రీత స్థాయిలో కెమెరాలు క్లిక్ మ‌న్నాయి, ఆ  ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే హిందీ జ‌నాల్లో తైమూర్ అలీఖాన్ క్రేజ్ గురించి వ‌ర్ణించ‌డం కూడా సాధ్యం కాదు. మ‌రి పుట్ట‌గానే ఆ పిల్లాడిని సెల‌బ్రిటీని చేసింది ఎవ‌రు? వెర్రిమొర్రి అభిమానం చూపించే జ‌నాలు కాదా? మ‌న ఎదురింట్లోనూ, పొరుగింట్లోనూ ఉండే పిల్ల‌లు కూడా చాలా క్యూట్ గా ఉంటారు. అదే త‌ర‌హాలో తైమూర్ కూడా. అంత మాత్రానికి పుట్ట‌గానే వాడిని సెల‌బ్రిటీని చేసింది నిస్సందేహంగా జ‌నాలే.

ఇదే క్రేజ్ ను ఇలాగే పెంచేస్తారు. ఎలాగూ రేపు తైమూర్ న‌టుడు అయిపోవ‌చ్చు. పిల్లాడిగానే వాడికంత క్రేజ్ ఉంది కాబ‌ట్టి దాని క్యాష్ చేసుకోవ‌డానికి ఏ క‌ర‌ణ్ జొహారో గంతులేయ‌వ‌చ్చు! అప్పుడు క‌ర‌ణ్ జొహార్ ను అని ఏం ప్ర‌యోజ‌నం? సెల‌బ్రిటీల పిల్ల‌ల‌ను దైవ‌దూత‌లుగా చూసే బానిస‌త్వం భార‌తీయుల ర‌క్తంలో  ఇమిడిపోయిన‌ట్టుగా ఉంది. ఐశ్వ‌ర్య‌రాయ్ కు కూతురు పుట్టిన‌ప్పుడు తెలుగు మీడియా కూడా హ‌ద్దుల్లేని అతి చేసింది. ఈనాడు ప‌త్రిక‌లో అయితే 'అమ్మ‌త‌నానికి అందం' అంటూ నీఛ‌మైన హెడ్డింగ్ ఒక‌టి పెట్టారు అప్ప‌ట్లో. ఐశ్వ‌ర్య‌రాయ్ త‌ల్లి అయితే అమ్మ‌త‌నానికే అందం వ‌చ్చింద‌ట‌! సెల‌బ్రిటీల విష‌యంలో ఇలాంటి నీఛ భాష్యాలు ప‌లికి మీడియాలో కొంత‌మంది బానిస‌త్వాన్ని జాతీయం చేస్తున్నారు. పుట్ట‌గానే ఆ పిల్ల‌ల‌నూ సెల‌బ్రిటీలుగా చేస్తున్నారు. తీరా వారు సినిమాల్లోకి వ‌స్తే.. వాళ్లు త‌ల్లిపేరు చెప్పుకుని వ‌చ్చార‌ని, తండ్రి పేరు చెప్పుకుంటున్నార‌నే నింద‌లు! 'గోంగూర నాడే..' అని తెలుగులో ఒక సామెత ఉంది. పుట్ట‌గానే వారిని సెల‌బ్రిటీలు చేయ‌డం మానేస్తే.. సినిమా ఇండ‌స్ట్రీల్లో బంధుప్రీతి త‌గ్గిపోతుంది. ఈ విష‌యం ఎంత‌మందికి అర్థం అవుతుంది?

పేషేంట్లకి బెడ్ ఇవ్వలేకపోతే మనం మనుషులమే కాదు

త‌ప్పంతా నాదే…రోజా నాకు అక్క లాంటిది