ఇప్పటి వరకూ దేశంలో అధికారికంగా కరోనా వ్యాక్సిన్ ను మూడో డోసు వేసుకోవడానికి అవకాశం లేనట్టే. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో బూస్టర్ డోస్ ను సజెస్ట్ చేస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడు మూడో డోసు వ్యాక్సిన్ వేయించుకుంటూ ఫొటోలకు పోజులు ఇస్తున్నారు. తమ దేశస్తులు బూస్టర్ డోసు వేసుకోవాలని వారు సూచిస్తూ ఈ ప్రకటనలు ఇస్తున్నారు.
అయితే.. కొన్ని దేశాలు ఇలా డోసుల మీద డోసులు వేసుకోవడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. మిగులు డోసులను మిగతా ప్రపంచానికి పంచాలని, ఇలా ఒకే దేశంలో ఒక్కోరికి మూడు డోసుల అత్యవసరం ఏమిటనేది ప్రశ్న! అయితే అభివృద్ధి చెందిన దేశాలు.. కరోనా భయాల నేపథ్యంలో బూస్టర్ డోసులకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టున్నాయి.
ఇక ఇండియా విషయానికి వస్తే.. తొలి డోసే వద్దన్న వాళ్లు కోకొల్లలు. కరోనా తమను ఏమీ చేయలేదనే ధీమా కోట్ల మంది భారతీయుల్లో ఉంది. ఇప్పుడు ఉచితంగా ప్రభుత్వం భారీ ఎత్తున వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచినా.. చాలా మంది అవకాశం ఉన్నా వేయించుకోవడం లేదు. ఇక ఏదో భయపడి తొలి డోసు వేయించుకున్న అనేక మంది రెండో డోసు జోలికి వెళ్లడం లేదు. వీళ్ల సంఖ్యా కోట్లలో ఉంది!
ఆరోగ్యకార్యకర్తలు, వలంటీర్లు.. ఇంటింటికీ తిరుగుతూ, వ్యాక్సిన్ వేయించుకోమని పోరుతున్నా జనాలు పట్టించుకోవడం లేదు! ఇదీ మన దేశంలో పరిస్థితి. కావాల్సిన వాళ్లు వేయించుకుంటున్నారు, మరి కొందరు ఆరోగ్య కార్యకర్తల ఒత్తిడి వల్ల తప్పక వేయించుకుంటున్నారు.
ఇక మరో నెలా రెండు నెలలు గనుక కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖంలో కొనసాగితే, ఆ తర్వాత ఇండియాలో బలవంతంగా కూడా వ్యాక్సిన్ వేయడం సాధ్యం అయ్యేట్టుగా లేదు. అప్పుడు ప్రజలు వ్యాక్సిన్ ను పిచ్చ లైట్ తీసుకోవడం ఖాయం.
ఆ సంగతలా ఉంటే.. డాక్టర్ల తీరు మాత్రం మరోలా ఉందని అంటోంది ఒక రిపోర్ట్. ముంబైలో చాలా మంది డాక్టర్లు… కరోనా మూడో డోసు వ్యాక్సిన్ కూడా తీసుకున్నారట. అనధికారికంగా వారు వ్యాక్సిన్ ను పొడిపించుకుంటున్నారని సమాచారం. ఏదో అందుబాటులో ఉందని వేసుకోవడం కాదు, వారు ఆందోళనతోనే వ్యాక్సిన్ తీసుకుంటున్నారనేది ఆసక్తిదాయకమైన విషయమిక్కడ. రెండో డోసుల వ్యాక్సిన్ ను పొందిన డాక్టర్లు యాంటీబాడీల టెస్టు చేయించుకుంటున్నారట.
ఎలాగూ వారికి టెస్టులు చేయించుకోవడం సులభం, ఖర్చు లేని పని కాబట్టి.. యాంటీబాడీ టెస్టులకు వెళ్తున్నారట. రెండు డోసుల వ్యాక్సిన్ అనంతరం కూడా తమ శరీరాల్లో పెద్దగా కరోనా యాంటీబాడీలు కనిపించకపోవడం వల్ల.. వారు మూడో డోసుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. యాంటీ బాడీల టెస్టుల తర్వాతే.. వారు మూడో డోసును వేయించుకుంటున్నారని తెలుస్తోంది.
ఇందుమూలంగా రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి.. రెండు డోసుల వ్యాక్సిన్ తర్వాత కూడా యాంటీబాడీల సంఖ్య ఏ మేరకు పెరిగిందనేది సామాన్యులకు మిస్టరీనే. ఇక రెండో విషయం.. కరోనా ప్రమాదం గడిచిపోయిందని డాక్టర్లు ఇంకా అనుకోవడం లేదనేది!