డ్రగ్స్ వినియోగం వ్యవహారంతో ఎన్సీబీ కస్టడీలో ఉన్న బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కేసుకు సంబంధించి తదుపరి విచారణ నేడు జరగనుంది. నేటితో ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి బెయిల్ పిటిషన్ ను వేస్తున్నారు ఆర్యన్ ఖాన్ న్యాయవాది. కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆర్యన్ కు బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఒకవేళ ఆర్యన్ కస్టడీని పొడిగించాలని ఎన్సీబీ కోరితే అప్పుడు కోర్టు ఎలా స్పందిస్తుందనేదాని మీదే ఈ వ్యవహారం ఆధారపడి ఉంది. ఇప్పటికే ఆర్యన్ ఫోన్ ను ఎన్సీబీ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ నివేదికను కోరింది. అలాగే ఆర్యన్ ఖాన్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఒక విదేశీ డ్రగ్స్ సప్లయర్ ను కూడా అరెస్టు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్యన్ కస్టడీని పొడిగించాలని ఎన్సీబీ కోరే అవకాశాలు లేకపోలేదు.
ఒకవేళ ఆర్యన్ కు గతం నుంచి డ్రగ్స్ వాడే అలవాటు ఉండి ఉంటే కూడా ఈ కేసులో ఎన్సీబీ కస్టడీని పొడిగించమని కోర్టును కోరే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది. అయితే ఎన్సీబీ కోరినట్టుగా కోర్టు ఈ కస్టడీని పొడిగిస్తుందా? అనేది చట్టపరమైన అంశాల మీద ఆధారపడిన మాట అట!
ఆర్యన్ ఖాన్ వద్ద పట్టుబడిన డ్రగ్స్ గా ఎన్సీబీ చెబుతున్న సమాచారం, నమోదు చేసిన ఒక సెక్షన్ ప్రకారం.. అతడికి గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష, ఇరవై వేల రూపాయల వరకూ ఫైన్ పడొచ్చునట. అయితే ఆర్యన్ పై ఎన్సీబీ ఇతర సెక్షన్లను కూడా నమోదు చేసింది. వాటిపై విచారణ జరగాల్సి ఉంది. నేరం తీవ్రత కూడా బెయిల్ విషయంలో ప్రభావం చూపవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు.