ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ ఇలాంటివి వుండగా, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఒకటి స్టార్ట్ చేసారు. దాని ద్వారా ప్రకటనలు ఇవ్వాలన్నారు. అక్కడ కోట్ల గోల్ మాల్ జరిగిందని వార్తలు వచ్చాయి. అది పక్కన పడిపోయింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని మరోటి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో కూడా రాజకీయాలు ఎక్కువ అయ్యాయని గుసగుసలు వినిపించడం ప్రారంభమైంది.
గిల్డ్ పెద్దలు వారి స్వంతం లేదా డిస్ట్రిబ్యూషన్ సినిమాలు అయితే ఒకలా, కాకుంటే మరోలా వెల్ ప్లాన్డ్ గా ఎత్తుగలు రచిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిల్డ్ పెద్దల సినిమా వుంటే మిగిలిన సినిమాలను అటు ఇటు జరిపేలా చేస్తున్నారు. సోలో డేట్ సంపాదించుకుంటున్నారు. లేదూ అంటే చేతుల ఎత్తేసి ఊరుకుంటున్నారు.
పైగా గిల్డ్ లో జరిగే చర్చలు మీడియాలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మీడియాతో ఎవరైనా సన్నిహితంగా వున్నారు అని అనిపిస్తే మెల్లగా వారిని పక్కన పెడుతున్నారు. అంతే సమావేశాల్లో ముందుగానే మీడియాకు ఏం చెప్పవద్దని హుకుం లు జారీ చేస్తున్నారు.
తమకు పోటీ వచ్చి సినిమాలు ఎవరైనా కొంటే గిల్డ్ పెద్దలు తెలివిగా రాజకీయాలు చేసి, సరైన డేట్ దొరక్కుండా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విధంగా ఆ సినిమాను కిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తమకు నచ్చిన సినిమా వుంటే దానికి పోటీ రాకుండా ఏదో విధంగా ప్రయత్నించడం గిల్డ్ పెద్దలకు అలవాటు అయిందని ఓ నిర్మాత కామెంట్ చేసారు. ఓపెద్ద సంస్థ తమ సినిమాల డిస్ట్రిబ్యూషన్ లో గిల్డ్ పెద్ద ఒకరిని పక్కన పెట్టింది. దాంతో ఇప్పుడు ఏదో ఒక లాజిక్ లాగి ఆ సంస్థ సినిమాలకు సరైన డేట్ ఇవ్వడం లేదన్న టాక్ వినిపిస్తోంది.
డేట్ ల కోసం అయినా డిస్ట్రిబ్యూషన్ చేతిలో పెట్టాల్సి వస్తోందని కొందరు నిర్మాతలు చెబుతున్నారు. మొత్తానికి గిల్డ్ లో కనిపించని లుకలుకలు వున్నాయని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఎంత వరకు నిజమో గిల్డ్ పెద్దలకే తెలియాలి.